
- ఉద్యోగాల కల్పనకు గనులు అవసరం
- ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడి
- మంచిర్యాల జిల్లా మందమర్రిలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కోల్‌బెల్ట్, వెలుగు: తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం నేరుగా బొగ్గు గనులు కేటాయించాలని, దీని వల్ల సంస్థలో కొత్త ఉద్యోగాలు వస్తాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా కేంద్రం ఆ రాష్ట్రానికి నేరుగా బొగ్గు బ్లాక్‌లను కేటాయించిందని, అదే విధంగా సింగరేణికి కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు.
గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, సింగరేణి ప్రాంతంలో కొత్త బొగ్గు గనులు, బొగ్గు అనుబంధ పరిశ్రమలు రావాల్సి ఉందన్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో సింగరేణికి సంస్థకు కొత్త బొగ్గు గనులు కేటాయించే అంశంపై చర్చించారని చెప్పారు.
కొత్త గనులు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల ఫండ్స్‌ను ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ కారణంగా మూడు నెలలు రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామన్నారు.
ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి..
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని, ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్లు వివేక్ వెంకటస్వామి తెలిపారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల కన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు అదనంగా కట్టి ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకే తమ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుందన్నారు.
చెన్నూరు నియోజకవర్గంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ప్రతిపాదనలు ఇచ్చానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇరిగేషన్ శాఖ రూ.14 వేల కోట్ల వడ్డీని కడుతుందని ఆ శాఖ అధికారులు చెప్పారన్నారు. హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్, మెడికల్ డిపార్ట్‌మెంట్ల కోసం గత బీఆర్‌ఎస్ సర్కార్ ఇబ్బడిముబ్బడిగా లోన్లు తీసుకుందని, ఇప్పుడు వాటిని కట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు.
ఆరు గ్యారంటీలతో పాటు ఇతర స్కీంల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎంపీపీ మంగా శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ రవి, క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ తదితరులు పాల్గొన్నారు.