కొత్త మున్సిపల్​ బిల్లు : ప్రత్యకంగా అసెంబ్లీ సమావేశాలు

కొత్త మున్సిపల్​ బిల్లు : ప్రత్యకంగా అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌, వెలుగు:కొత్త మున్సిపల్‌ యాక్ట్​ బిల్లును ఆమోదించడం కోసం రెండు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 18, 19 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మండలి సెషన్‌ 19వ తేదీకే పరిమితం కానుంది. 18న సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో కొత్త మున్సిపల్‌ యాక్ట్​ బిల్లును ప్రవేశపెడతారు. దానిపై అధ్యయనం చేయడానికి సభ్యులకు ఆ రోజు సమయం ఇచ్చి 19న చర్చించిన అనంతరం బిల్లును ఆమోదిస్తారు.

19న ఉదయం మండలిలో కేబినెట్‌ మంత్రుల్లో ఒకరు కొత్త మున్సిపల్‌ యాక్ట్‌ బిల్లును ప్రవేశపెడతారు. కొంత విరామం తర్వాత దానిపై చర్చించి మండలిలో బిల్లును పాస్‌ చేస్తారు. మున్సిపల్‌ యాక్ట్​ బిల్లు ఆమోదం కోసమే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నదని, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ ఈ సెషన్‌లో ఉండబోవని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్​ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ గతంలోనే ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని ఉభయ సభల ఆమోదానికి తెస్తున్నారు. మున్సిపల్‌ డ్రాఫ్ట్‌ బిల్లు సిద్ధమయ్యిందని, మార్పుచేర్పులు, లీగల్‌ అంశాలపై అధ్యయనం కోసం న్యాయశాఖకు పంపామని సీఎంవో ఈ ప్రకటనలో వెల్లడించింది.

ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు రాష్ట్ర ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. ఫిబ్రవరి 25న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపగానే అసెంబ్లీ, మండలి వాయిదా పడ్డాయి. ఆ తర్వాత ఉభయ సభలను ప్రోరోగ్​ చేస్తూ గవర్నర్‌ నరసింహన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. మున్సిపల్‌ యాక్ట్​ బిల్లు ఆమోదానికి ఉభయ సభలను సమావేశ పరిచేందుకు గవర్నర్‌ తిరిగి నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. శుక్ర, శనివారాల్లో ఈ నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముంది.