రూ.282 కోట్లతో ఉస్మాన్సాగర్ కొత్త పైప్లైన్

రూ.282 కోట్లతో ఉస్మాన్సాగర్ కొత్త పైప్లైన్
  • ప్రస్తుతం ఉన్నదానికి సమాంతరంగా నిర్మాణం
  • గండిపేట కాండ్యూట్ లీకేజీలతో వృథాగా పోతున్న నీళ్లు 
  • రిపేర్లతో పాటు కొత్త పైప్​లైన్​ నిర్మాణానికి ప్రతిపాదనలు  
  • డీపీఆర్​ రెడీ చేసిన వాటర్​బోర్డు త్వరలోనే టెండర్లకు ఆహ్వానం  

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​హైదరాబాద్ కు పెరుగుతున్న తాగునీటి అవసరాలకు అనుగుణంగా ఉస్మాన్​సాగర్ నుంచి మరింత ఎక్కువ నీటిని డ్రా చేసుకునేందుకు అధికారులు ప్లాన్లు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా మరో కొత్త పైపు లైన్​నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం ఉస్మాన్​సాగర్​నీటిని కాండ్యూట్​ద్వారా ఆసిఫ్​నగర్​ ఫిల్టర్​బెడ్స్​కు తరలించి శుద్ధి చేస్తున్నారు. కొత్తగా తయారు చేసిన ప్లాన్​లో ఈ కాండ్యూట్​కు సమాంతరంగా మరో కొత్తపైప్​లైన్​ నిర్మించాలని వాటర్​బోర్డు నిర్ణయించింది. ఈ పైప్​లైన్​పూర్తయితే ఉస్మాన్​సాగర్​కాండ్యూట్​తో పాటు పైప్​లైన్​ద్వారా ఎక్కువ నీటిని డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది.

నిజాం హయాంలో నిర్మాణం

ఉస్మాన్​సాగర్​ కాండ్యూట్​ నిజాం హయాంలో నిర్మించారు. పూర్తిగా గ్రావిటీ ద్వారా ఈ నీరు నేరుగా 14 కి.మీ. నుంచి ఆసిఫ్​నగర్​ ఫిల్టర్​బెడ్​కు చేరుతుంది. ఇప్పుడీ ఈ కాండ్యూట్​ (కాలువ) శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిలో ప్రవహించే నీటిలో 50శాతం వరకూ లీకేజీల ద్వారా వృథాగా పోతోంది. ఉస్మాన్​సాగర్ నుంచి 27 ఎంజీడీలు సరఫరా చేసేందుకు అవకాశమున్నా అధికారులు 20 నుంచి 22 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 

అయినా, మధ్యలో లీకేజీలు పోను వినియోగదారులకు 8 నుంచి 10 ఎంజీడీలు మాత్రమే చేరుతున్నాయి. ఇంత భారీగా నీరు పోతుండడంతో కాండ్యూట్​ను రిపేర్​చేయడంతో పాటు, పెరుగుతున్న అవసరాలకు మరింత ఎక్కువ నీటిని డ్రా చేసేందుకు కాలువ పొడవునా మరో కొత్త పైప్​లైన్​ నిర్మించాలని ప్రతిపాదించారు.