సామాన్యుడికి అండగా కొత్త రెవెన్యూ చట్టం: మంత్రి కేటీఆర్

సామాన్యుడికి అండగా కొత్త రెవెన్యూ చట్టం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరం గత ఆరేళ్లుగా దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానం గా మారిందన్నారు మంత్రి కేటీఆర్. ఒకవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వం తో పెద్ద ఎత్తున హైదరాబాద్ విస్తరిస్తోందన్నారు. GHMC పరిధిలో వివిధ కాలనీల్లో కొన్ని ఏళ్లుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యల పైన మంత్రి  కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి కేటీఆర్.

తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతోందన్నారు. సామాన్యుడిపై ఏలాంటి భారం పడకుండా సామాన్యుడికి అండగా ఉంటూ అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయన్నారు. వ్యవసాయ,వ్యవసాయేతర ఆస్తుల కి ప్రత్యేకంగా రెండు వేరు వేరు రంగుల్లో పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా భూ సమస్యలు తొలగిపోయాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తోందన్నారు.

హైదరాబాద్ నగరంలో సుమారు 24 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా వుందన్నారు మంత్రి కేటీఆర్ . ఇందులో లో ఇందులో వివిధ కారణాలతో కొన్ని ఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రజలకు వారి ఆస్తుల పైన హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే చేస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో భాగంగా విస్తృతంగా చర్చించిన… తర్వాత అవసరమైతే క్యాబినెట్ ద్వారా ప్రత్యేక నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ లోని ఆస్తుల క్రయ విక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుందన్నారు. ఇందుకోసం శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా దళారులను నమ్మవద్దని… ఒక్కపైసా ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.