టీఆర్ఎస్లో కోవర్టుల భయం 

 టీఆర్ఎస్లో కోవర్టుల భయం 

మునుగోడు నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి కొత్త టెన్షన్ మొదలైంది. ఉప ఎన్నికల సమరం రోజు రోజుకూ వేడెక్కుతుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి కోవర్టుల భయం పట్టుకుంది. ఎవరు సొంత వాళ్లో.. ఎవరు ప్రత్యర్థులకు సమాచారం ఇస్తున్నారో అర్థంకాక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే స్థాయి నుంచి సర్పంచ్ వరకు ఎవరిని నమ్మాలో..ఎవరిని నమ్మొద్దో కూడా తెలవట్లేదని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.

అడుగడుగునా అడ్డంకులు..

టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నికలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సొంత పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కాపాడుకోవడానికి సతమతం అవుతోంది. బుజ్జగింపులు సైతం పనిచేయకపోవడంతో ఇప్పటికే కొందరు ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరారు. ఒకవైపు మునుగోడులో సీఎం కేసీఆర్ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు నేతలు పాట్లు పడుతుంటే.. ఇప్పుడు కోవర్ట్ ల ఇష్యూ టీఆర్ఎస్ ను బెంబేలేతిస్తోంది. 

ఉప ఎన్నిక భారమంతా స్థానిక నేతలపైనే

మునుగోడు ఉప ఎన్నిక భారాన్ని సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి , ఇతర సీనియర్ నేతలపైనే పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా మంత్రి హరీష్ రావు ఇంఛార్జిగా నియమించేవారు. కానీ ఈసారి మాత్రం స్థానిక నేతలనే నమ్ముకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలకు మండలాలవారీగా ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చారు. బహిరంగ సభకు జనాల్ని తీసుకువచ్చే బాధ్యతల్ని ఎమ్మెల్యేలకు అప్పగించారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలకు రాజగోపాల్ రెడ్డితో కూడా మంచి సంబంధాలు వుండటం తో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం అవడం లేదని టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. 

రాజగోపాల్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఇప్పటికీ కొంత మంది నల్గొండ టీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక ఎమ్మెల్యే కు హాస్పిటల్ వైద్యం కోసం 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రచారంలో వుంది. రాజగోపాల్ రెడ్డి స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఈ సంబంధాల తోనే ఆయన గెలిచారన్న చర్చ కూడా వుంది. ఇక స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా అసంతృప్తితో వుండటంతో టీఆర్ఎస్ లో ఎవరినీ నమ్మలేని పరిష్టితి నెలకొందని అంటున్నారు. 

అసంతృప్తితో రగిలిపోతున్న స్థానిక నేతలు

టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వాళ్లలో కొందరు బిజెపి కి టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాళ్ల పేర్లు తెలిసినా బీజేపీలోకి వెళ్లొద్దు అని అడగలేని పరిస్థితి నెలకొంది. ఏదైనా మీటింగ్ పెట్టి వ్యూహ రచన చేస్తే .. ఆ వివరాలు వెంటనే ప్రత్యర్థుల శిబిరాలకు చేరుతున్నట్లు టీఆర్ఎస్ నేతల దృష్టికి వచ్చినట్లు గుర్తించారు. మొహం మీద అడిగితే వ్యవహారం పూర్తిగా మారిపోతుంది. మొహమాటానికి పోయి ఎవరినీ ఏమీ అనకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండటంతో ఎలా ముందుకెళ్లాలన్న అంశం పై సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.