UPI News: ఆగస్టు 1 నుంచి మారుతున్న యూపీఐ రూల్స్.. కొత్తగా బయోమెట్రిక్ చెల్లింపులు..!

UPI News: ఆగస్టు 1 నుంచి మారుతున్న యూపీఐ రూల్స్.. కొత్తగా బయోమెట్రిక్ చెల్లింపులు..!

UPI Augut Rules:  దేశంలో జరుగుతున్న మెుత్తం డిజిటల్ చెల్లింపుల్లో 85 శాతం యూపీఐ ద్వారానే నిర్వహించబడుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెల్లడించింది. అయితే దీనిని మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, డౌన్ టైమ్ లేకుండా కొనసాగేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సరికొత్త చర్యలతో ముందుకొచ్చింది. 

ఆగస్టు 1 నుంచి యూపీఐ చెల్లింపుదారుల విషయంలో వస్తున్న మార్పులు బ్యాంకులు, మర్చంట్ సంస్థలు, వినియోగదారులకు సంబంధించినవి. దీనిద్వారా యూపీఐ యూజర్లు రోజులో గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే తమ అకౌంట్  బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు అనుమతించబడతారు. 

అలాగే ఆగస్టు 1 నుంచి యూపీఐ ఆటోపే చెల్లింపుల విషయంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కొత్త టైమ్ స్లాట్ ఆధారిత విధానాన్ని అమలులోకి తీసుకొస్తోంది. దీని ప్రకారం రోజులో ఇష్టమెుచ్చిన సమయంలో ఈఎంఐ, యుటిలిటీ బిల్స్, సబ్ స్కిప్షన్ పేమెంట్స్ ఆటోపే ట్రాన్సాక్షన్లు జరగవు. వాటికి ప్రత్యేక సమయం కేటాయించబడనుంది. ఈ ప్రక్రియ యూజర్లకు సంబంధం లేకుండా బ్యాకెండ్ లో మార్పు చేయబడుతోంది. దీని ద్వారా రోజు మెుత్తంలో ప్రధానంగా పీక్ గంటల్లో అంతరాయాలను నివారించవచ్చని పేమెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇది యూపీఐ చెల్లింపు వ్యవస్థలపై రద్దీని తగ్గించి, పేమెంట్ ఫెల్యూర్లను నివారిస్తుంది.

బయోమెట్రిక్ యూపీఐ పేమెంట్స్..
రానున్న కాలంలో యూపీఐ చెల్లింపులకు పిన్ అవసరం లేకుండా బయోమెట్రిక్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ విధానాలతో చెల్లింపులు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు యూపీఐ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు చూస్తున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కూడా దీనిని అమలు చేయటం ద్వారా భద్రతను పెంచటం, పిన్ దుర్వినియోగాలను నివారించటాన్ని పరిశీలిస్తోందని సమాచారం. అయితే ఇందులో ప్రజల బయోమెట్రిక్ డేటాను ఎలా సురక్షితంగా ఉంచుతారు, అవి పనిచేయని పక్షంలో పేమెంట్ చేసే విధానం వంటి వాటిపై అధ్యయనం కొనసాగుతోంది. పిన్ దుర్వినియోగం ద్వారా జరుగుతున్న మోసాలను దీని ద్వారా నివారించవచ్చని ఫిన్ టెక్ సంస్థలు భావిస్తున్నాయి.