ఏడాదంతా పెండ్లి గుర్తుండిపోయేలా: ఇంజనీర్ వెరైటీ పెండ్లి పిలుపు

ఏడాదంతా పెండ్లి గుర్తుండిపోయేలా: ఇంజనీర్ వెరైటీ పెండ్లి పిలుపు

కొత్త సంవత్సరం రాగానే అందరం క్యాలెండర్ కోసం చూస్తాం. ఏడాది పొడవునా దాని మొహం చూడాల్సిందే కదా. సరిగ్గా ఇదే అనుకున్నాడో ఏమో ఏడాది మొత్తం తన పెండ్లి బంధువులకు, స్నేహితులకు గుర్తుండిపోయేలా చేస్తున్నాడా యువకుడు. నెల్లూరుకు చెందిన యువ ఇంజనీర్ తన పెండ్లి పిలుపులకు వెరైటీ స్టైల్ ఎంచుకుని అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని శిరసనంబేడు గ్రామానికి చెందిన కామిరెడ్డి కేశవులరెడ్డి, సుమతి మొదటి సంతానం సాయిమురళీకృష్ణారెడ్డి. ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో పని చేస్తున్న సాయి పెండ్లి ఫిబ్రవరి 7న జరగబోతోంది. వినూత్నంగా ఆలోచించి తన పెళ్లి ఏడాదంతా గుర్తుండేలా పెళ్లి కార్డులు తయారు చేయించాడు. కొత్త సంవత్సరం క్యాలెండర్‌పై తన ఫొటో, పెళ్లి కూతురి ఫొటో ముద్రించి.. తన వివాహానికి రావాలని ఆహ్వానిస్తున్నాడు. దాదాపు 1000 క్యాలెండర్లు ప్రింట్ చేయించి తన బంధు మిత్రులను ఆహ్వానిస్తున్నాడు పెండ్లి కొడుకు సాయి.