ఇబ్రహీంపట్నంలో ‘పాతరాతియుగం పనిముట్లు’

ఇబ్రహీంపట్నంలో ‘పాతరాతియుగం పనిముట్లు’
  •     మంచిరేవుల ఫారెస్ట్​ ట్రాక్ లో  నీటి కాల్వ ఒడ్డున ఆనవాళ్లు  

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల ఫారెస్ట్​ట్రాక్‌లోని నీటికాలువ (వాగు) ఒడ్డున పాతరాతియుగానికి చెందిన అరుదైన రాతిపనిముట్లు వెలుగులోకి వచ్చాయి. క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ మీర్ ఒమర్ అలీఖాన్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ సంయుక్తంగా నిర్వహించిన ఫీల్డ్​విజిట్​లో వీటిని గుర్తించారు. 

ఇందులో 24 సెం.మీ పొడవు, 27 సెం.మీ చుట్టుకొలత, 130 గ్రాముల బరువున్న క్వార్ట్జ్ రాతిపనిముట్టుతో పాటు 15 సెం.మీ పొడవు, 21 సెం.మీ చుట్టుకొలత, 45 గ్రాముల బరువున్న మరో పనిముట్టు, 9 సెం.మీ పొడవు, 17 సెం.మీ చుట్టుకొలత, 30 గ్రాముల బరువున్న రాతిపనిముట్టు లభించాయి. 

రాతిగొడ్డళ్లు, చీల్పుడు రాతి పనిముట్టు, పనిముట్టు తయారీకి ఉపయోగించే కోర్ మెటీరియల్ దొరికాయి. వీటిని ధార్వాడ్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రవి కొరిసెట్టర్ పాతరాతియుగానికి చెందినవిగా నిర్ధారించారు. ఇదే ప్రాంతంలో గతంలో మధ్యరాతియుగానికి చెందిన రాతిచిత్రాలు, పనిముట్లు దొరకగా, బీఎన్‌ఆర్ హిల్స్‌లో కొత్తరాతియుగానికి చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. నగర విస్తరణతో ఇలాంటి చారిత్రక ఆధారాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నందున, రక్షించి భావితరాలకు తెలంగాణ చరిత్ర వైభవాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు.