సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్

సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్

రియాద్: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. బుధవారం సౌదీ అరేబియాపై జరిగిన భారీ వైమానిక దాడులను ఆ దేశ రక్షణ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. సౌదీలోని తూర్పు ప్రాంతంపైకి దూసుకొచ్చిన ఒక బాలిస్టిక్ క్షిపణి, 32 అత్యాధునిక డ్రోన్లను గాల్లోనే అడ్డుకుని బుధవారం తెల్లవారుజామున కూల్చివేసినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో సౌదీపై దాడుల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. 

మంగళవారం కూడా ఇదే ప్రాంతంలో 21 డ్రోన్లను ధ్వంసం చేసినట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు.  సౌదీ రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మల్కీ ఈ దాడులను ధ్రువీకరిస్తూ ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ పెట్టారు. శత్రువుల దాడులను ఎదుర్కోవడానికి తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌‌‌‌లు 24గంటలు అప్రమత్తంగాఉన్నాయని తెలిపారు. 

తాజా దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా తన సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ నిరంతరం దాడులు చేస్తోంది. కేవలం సౌదీ మాత్రమే కాకుండా, ఇతర గల్ఫ్ దేశాలపై కూడా బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో అటాక్స్ చేస్తున్నది. దీనివల్ల భారీగా ఆస్తి నష్టం జరగడమే కాకుండా, పలుచోట్ల ప్రాణనష్టం కూడా సంభవిస్తున్నది.