హైదరాబాద్, వెలుగు: పేద దళితులకు దళితబంధు దక్కలేదని, అర్హులను విస్మరించి గత ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులకే ఇచ్చిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దళిత బంధును రిలీజ్చేసి అర్హులకు అందేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది, బడ్జెట్‌లో నిధులు కేటాయించాం, బ్యాంక్ లింకేజీ ద్వారా పేద యువతకు త్వరలో లోన్లు అందిస్తాం”అని తెలిపారు. అద్దె, డైట్, కాస్మోటిక్ ఛార్జీలు ప్రతి నెలా 7వ తేదీ లోపే విడుదల చేస్తామని దీనికి సీఎం, డిప్యూటీ సీఎం అంగీకరించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలోని రూ.9,053.16 కోట్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల బకాయిలను దశల వారీగా చెల్లిస్తున్నామన్నారు. అలాగే, అంబేద్కర్ ఓవర్సీస్ స్కీంలో రూ.51 కోట్లు ఇప్పటికే చెల్లించినట్లు తెలిపారు. ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ తీసుకొని సివిల్స్ కోసం ఆరుగురు, టీజీపీఎస్సీ గ్రూప్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని, ఫ్యాకల్టీని ఢిల్లీ నుంచి తీసుకుని ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి వివరించారు.
