బీసీ హాస్టళ్ల బిల్లులు చెల్లించండి : ఆర్.కృష్ణయ్య

బీసీ హాస్టళ్ల  బిల్లులు చెల్లించండి : ఆర్.కృష్ణయ్య
  •     డిప్యూటీ సీఎంను కోరిన ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ కాలేజీ హాస్టళ్లు, ప్రీ-మెట్రిక్ హాస్టళ్లకు సంబంధించిన మెస్​, అద్దె భవనాలు, కరెంట్, ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యంతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. 6 నెలలుగా మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిత్యావసరాల సరఫరాదారులు బిల్లుల చెల్లింపుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. 

దాదాపు 8 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమానులు హాస్టళ్లను ఖాళీ చేయాలంటున్నారని చెప్పారు. సుమారు రూ. 6 వేల కోట్ల ఫీజు బకాయిలు, రూ. 8 వేల కోట్ల రీయింబర్స్‌‌‌‌మెంట్ నిధులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని, వీటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో బీసీలకు కేటాయింపులను రూ. 20 వేల కోట్లకు పెంచాలని, గురుకులాలు, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.