కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా.. కార్యకర్తల సమక్షంలో ప్రకటన.. పార్టీ చీఫ్ ఖర్గేకు లేఖ

కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా.. కార్యకర్తల సమక్షంలో ప్రకటన.. పార్టీ చీఫ్ ఖర్గేకు లేఖ
  • అవమానాలు తట్టుకోలేక బాధతోనే పార్టీ వీడుతున్నా 
  • పీసీసీ చీఫ్ కావాల్సిన వాణ్ని.. ఇప్పుడు కార్యకర్తల హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి  
  • గాంధీ భవన్​లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కుర్చీలా?  
  • వేం నరేందర్ రెడ్డి ఎవరు? పార్టీకి చేసిన సేవ ఏంటి? 
  • చంద్రబాబు, కేసీఆర్​తో కొట్లాడిన.. ఇప్పుడు రేవంత్​తో కొట్లాడుతానని కామెంట్​

జగిత్యాల, వెలుగు:కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీలో తనకు, తన అనుచరులకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక బాధతోనే పార్టీ వీడుతున్నానని స్పష్టంచేశారు. బుధవారం జగిత్యాలలో తన అనుచరుల సమక్షంలో నిర్ణయం ప్రకటించిన ఆయన.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపించారు. తన నివాసం నుంచి జంబి హనుమాన్ ఆలయం వరకు సుమారు 1,500 మంది కార్యకర్తలతో కలిసి కాలినడకన వెళ్లిన జీవన్ రెడ్డి అక్కడ పూజలు నిర్వహించారు. 

అనంతరం స్థానిక బండారి గార్డెన్ లో జరిగిన సమావేశానికి హాజరై, తన నిర్ణయాన్ని  జీవన్ ​రెడ్డి వెల్లడించారు. 40 ఏళ్ల పాటు పార్టీ కోసం నిస్వార్థంగా పని చేశానని, కానీ తనకు సరైన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా అనంతరం కాంగ్రెస్ కండువాను తీసి రైతు కండువా వేసుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్​పార్టీ నీ ఒక్కడిదే కాదు. సీనియర్లను గౌరవించడం నేర్చుకోవాలి”అని సూచించారు.

 ‘‘అణగదొక్కబడే కంటే ఎదిరిస్తే నాకు పోయేది ఏముంది.. ఎదిరించి కొట్లాడుతా.. చంద్రబాబు, కేసీఆర్​తో కొట్లాడాను.. ఇప్పుడు రేవంత్​తో కూడా పోరాడుతా..’’ అని అన్నారు. రేవంత్​రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు. ‘గాంధీ భవన్​లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తారా?’ అంటూ ఫైర్​అయ్యారు. తనకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, తన అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. ‘‘కేసీ వేణుగోపాల్ ఇచ్చిన హామీని కూడా పక్కన పెట్టారు.. జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డి హత్య జరిగినా హైకమాండ్​ స్పందించలేదు. సీఎం కనీసం ఫోన్ చేసి ఓదార్చలేదు’’ అని విమర్శించారు. సరైన అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం వల్లే చేవెళ్ల, సికింద్రాబాద్, మహబూబ్​నగర్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిందన్నారు.  

పెట్టుబడిదారులకే ప్రాధాన్యమిస్తున్నరు..  

పీసీసీ అధ్యక్షుడు కావాల్సిన తనను.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కారణంగా పదవి దక్కకుండా చేశారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అక్కడ ఎందుకు గెలవలేదు? పార్టీలో సీనియర్లను పక్కనబెట్టి, పెట్టుబడిదారులకు ప్రాధాన్యం ఇస్తున్నరు. ఈ క్రమంలోనే నన్ను మోసం చేశారు’’ అని చెప్పారు. ఇకపై తన రాజకీయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ, వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై జీవన్​రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని మొదటి నుంచే చెబుతున్నానని, కానీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా పార్టీలో చేర్చుకున్నారని తప్పుపట్టారు. తనతో ఉన్న కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' అంటూ ముందుకు వెళ్తుంటే, ఇక్కడ మాత్రం ఆ విలువలను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఫైర్​అయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ ప్రభుత్వంతో కలిసి పని చేయడం వేరే విషయమని, కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అతని జోక్యం ఎందుకని ప్రశ్నించారు. 

తన ఓపికకు కూడా హద్దు ఉంటుందని.. 20 నెలలుగా అవమానాలు భరిస్తూ వచ్చానన్నారు. పార్టీని వీడినప్పటికీ ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలో పని చేస్తానని చెప్పారు. తనకు అండగా నిలవాలని కార్యకర్తలకు జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. 'పదవులు కాదు.. ఆత్మగౌరవమే ముఖ్యం' అంటూ జీవన్ రెడ్డి వెంట నడుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా తమ పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించారు. ఇక అవమానాలు భరించలేమని, స్వేచ్ఛగా పోరాటం చేస్తామన్నారు.