IND vs NZ 4th T20I: చెలరేగిన న్యూజిలాండ్ ఓపెనర్లు.. టీమిండియా ముందు బిగ్ టార్గెట్

IND vs NZ 4th T20I: చెలరేగిన న్యూజిలాండ్ ఓపెనర్లు.. టీమిండియా ముందు బిగ్ టార్గెట్

న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా బౌలర్లు మరోసారి విఫలమయ్యారు. బుధవారం (జనవరి 28) విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కివీస్ కు భారీ స్కోర్ సమర్పించుకున్నారు. న్యూజిలాండ్ ఓపెనర్లు డేవాన్ కాన్వే (44), టిమ్ సీఫెర్ట్ (62) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ జట్టు 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. సీఫెర్ట్ (36 బంతుల్లో 62: 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. బుమ్రా, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు కాన్వే, సీఫెర్ట్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే వీరిద్దరూ భారత బౌలలపై ఎదురుదాడికి దిగారు. తొలి ఓవర్లోనే సీఫెర్ట్ మూడు ఫోర్లు కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. సీఫెర్ట్ తో పాటు మరో ఎండ్ లో కాన్వే కూడా బ్యాట్ ఝులిపించడంతో పవర్ ప్లే లో న్యూజిలాండ్ వికెట్ కోల్పోకుండా 71 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా వీరిద్దరి జోరు తగ్గలేదు. వీరిద్దరి మెరుపులకు కివీస్ 8.1 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. తొలి వికెట్ కు 100 పరుగులు జోడించిన తర్వాత కాన్వేను ఔట్ చేసి కుల్దీప్ యాదవ్ టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. 

ఆ తర్వాత ఓవర్లోనే రచీన్ రవీంద్ర వికెట్ ను బుమ్రా పడగొట్టి రెండో వికెట్ అందించాడు. మరో ఎండ్ లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ చేసుకొని జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. మిడిల్ ఓవర్స్ లో ఇండియా బౌలర్లు పుంజుకోవడంతో కివీస్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. డారిల్ మిచెల్ తప్ప వచ్చినవారు బ్యాటింగ్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. వికెట్లను కోల్పోయినా కివీస్ మాత్రం రన్ రేట్ తగ్గకుండా పరుగులు చేస్తూ వచ్చింది. చివరి వరకు క్రీజ్ లో ఉన్న మిచెల్ 18 బంతుల్లోనే 39 పరుగులు చేసి జట్టును 200 పరుగుల మార్క్ దాటించాడు.