స్వదేశంలో టీమిండియాకు తిరుగు లేదు. టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే టీమిండియా నెక్స్ట్ లెవల్ ఆట తీరుతో చెలరేగిపోతుంది. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన దగ్గర నుంచి పొట్టి ఫార్మాట్ లో భారత జట్టు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదంటే మన జట్టు ఎంత ఫామ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. టీ20 వరల్డ్ కప్ లోనూ టీమిండియానే క్లియర్ ఫేవరేట్. ఇంతవరకు బాగానే ఉన్నా సూర్య సేనకు కివీస్ టెన్షన్ పట్టుకుంది. భారత జట్టు అంటే ఆ జట్టు సమిష్టిగా ఆడుతూ విజయాలు సాధిస్తుంది. బుధవారం (జనవరి 21) నాగ్‌పూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ లో ఇండియాతో జరగబోయే ఈ మ్యాచ్ లో కివీస్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది.
వన్డే సిరీస్ గెలిచి జోరుమీదున్న కివీస్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించే ఆల్‌రౌండర్లకు కొదవలేదు. ముఖ్యంగా డారిల్ మిచెల్ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఓపెనింగ్‌లో రాబిన్సన్, డేవన్ కాన్వే ఇచ్చే ఆరంభంపై భారీ స్కోర్లు ఆధారపడి ఉంటాయి. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్ మిడిల్‌లో కీలకం కానున్నారు. మిచెల్ శాంట్నర్, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీతో కూడిన పేస్ బౌలింగ్‌కు తిరుగులేదు. కాలిపిక్క గాయంతో బాధపడుతున్న మైకేల్ బ్రేస్‌వేల్ ప్లేస్‌లో జేమ్స్ నీషమ్ ఆడనున్నాడు. స్పిన్నర్ ఇష్ సోధీ ప్రభావం చూపిస్తే ఇండియన్ బ్యాటర్లకు తిప్పలు తప్పవు.
►ALSO READ | IND vs NZ: నా బ్యాటింగ్ ఆర్డర్ మారడానికి కారణం అదే.. తొలి టీ20కి ముందు సూర్య కామెంట్స్ వైరల్
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టులో ఉన్న ప్రతి ప్లేయర్ ఫామ్ లోనే ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. వన్డే సిరీస్ కు దూరమైన కెప్టెన్ శాంట్నర్ తో పాటు ఫాస్ట్ బౌలర్లు జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ జట్టులో చేరారు. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించగలరు. ఏడాది వ్యవధిలో టెస్ట్, వన్డే సిరీస్‌లను గెలిచిన కివీస్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. 2017, 2023లో రెండుసార్లు సిరీస్ గెలుపుకు దగ్గరగా వచ్చినా 1–2తో కోల్పోయారు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత కివీస్ ఆడిన 21 మ్యాచ్‌ల్లో 13 గెలిచింది. కివీస్ ఫామ్ చూసుకుంటే ఇండియా సిరీస్ గెలవడానికి శ్రమించాల్సిందే.
న్యూజిలాండ్ తో తొలి టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్
న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 (అంచనా):
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), టిమ్ రాబిన్సన్, డేవన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ
