IND vs NZ: న్యూజిలాండ్‌పై 79 పరుగులకే ఆలౌట్.. నాగ్‌పూర్‌లో టీమిండియాకు చేదు జ్ఞాపకం

IND vs NZ: న్యూజిలాండ్‌పై 79 పరుగులకే ఆలౌట్.. నాగ్‌పూర్‌లో టీమిండియాకు చేదు జ్ఞాపకం

ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మరి కొన్ని గంటల్లో తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. బుధవారం (జనవరి 21) నాగ్‌పూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా క్లియర్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై టీమిండియాను ఓడించాలంటే కివీస్ కు కష్టమే. అయితే భారత జట్టు అంటే న్యూజిలాండ్ రెచ్చిపోయి ఆడుతుంది. బలాబలాలను పక్కన పడితే గత కొన్నేళ్లుగా టీమిండియాకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. 2024లో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు.. తాజాగా ఇండియాకు వచ్చి వన్డే సిరీస్ గెలిచారు. 

తొలి టీ20కి ముందు న్యూజిలాండ్ ను తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే. నాగ్ పూర్ వేదికగా జరగబోయే తొలి టీ20లో ఇండియా ఫేవరేట్ గ బరిలోకి దిగుతున్నా ఇదే గ్రౌండ్ లో న్యూజిలాండ్ టీమిండియాకు ఊహించని ఓటమిని మిగిల్చింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2016 ఇండియాలో జరిగింది. లీగ్ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ పై ఇండియా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో కేవలం 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో ప్రతి భారత బౌలర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. 

అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాకు ఈ స్కోర్ ఛేజ్ చేయడం పెద్ద విషయం కాదనుకున్నారు. అయితే కివీస్ బౌలింగ్ ధాటికి టీమిండియా కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయింది. వరల్డ్ కప్ లో భారత జట్టుకు ఇది ఊహించని షాక్. ధోని (30), కోహ్లీ (23) పర్వాలేదనిపించినా మిగిలివారందరూ విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ నాలుగు ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. 10 ఏళ్ళ తర్వాత ఇదే గ్రౌండ్ లో న్యూజిలాండ్ పై టీమిండియా ప్రతీకారం తీసుకునే  అవకాశం వచ్చింది. వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో ఎలా ఆడుతుందో చూడాలి.