నాగర్‌కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో జరుగుతున్న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి జాతరలో విషాదం నెలకొంది. బుధవారం రాత్రి జాతరలో దైవదర్శనానికి వెళ్తుండగా టికెట్‌కు రూ.100 ఇవ్వాలని ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి అదే గ్రామానికి చెందిన భక్తురాలు చంద్రకళను డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఎందుకు ఇవ్వాలని ఆమె ప్రశ్నించగా వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో నిర్వాహకుడు తల్లితో పాటు రెండు నెలల చిన్నారిని తోసేశాడు. వారు కింద పడడంతో గాయాలయ్యాయి. శనివారం ఉదయం చిన్నారి మృతిచెందింది. శ్రీనివాస్‌రెడ్డి తోసేయడం వల్లే గాయాలై పాప మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనపై నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డెడ్‌బాడీతో ఆందోళన..
చిన్నారి మృతదేహంతో ప్రజాసంఘాల నాయకులు జిల్లా ప్రభుత్వ దవాఖాన ఎదుట మూడు గంటలపాటు ధర్నా నిర్వహించారు. డీఎస్‌పీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, బీఎస్పీ నాయకులు బోనాసి రామచందర్, లక్ష్మణ్ గౌడ్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు చిన్నారి తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
