- ఘనంగా సభ్యులకు సన్మానం
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : కొత్త సర్పంచ్ల ప్రమాణస్వీకారం సోమవారం పండుగ వాతావరణంలో జరిగింది. గ్రామ పంచాయతీ ఆఫీస్‌లకు రంగులు వేసి, పువ్వులు, మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలతో డెకరేట్ చేశారు. స్పెషల్‌ఆఫీసర్లు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం1,613 గ్రామ పంచాయతీలు ఉండగా.. మెదక్ జిల్లాలో 492, సిద్దిపేట జిల్లాలో 508, సంగారెడ్డి జిల్లాలో 612 కలిపి మొత్తం 1,612 మంది సర్పంచ్ లుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్పల్లి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందిన చాల్కి రాజు ఎన్నికలకు ముందే ఆత్మహత్య చేసుకొన్నారు.
దీంతో అక్కడ ప్రమాణ స్వీకారోత్సవం జరగలేదు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంబీర్పూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం బీబీపేట సర్పంచ్ ప్రమాణస్వీకారోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు.
సర్పంచ్ బండారు సంతోషమ్మ, వార్డు మెంబర్లను సన్మానించి అభినందించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిజిలిపూర్ పంచాయతీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాల్గొన్నారు. సర్పంచ్ పెంటమ్మను సన్మానించిచారు. పలుచోట్ల ఆయా పార్టీల నాయకులు నూతన పాలకవర్గ సభ్యులను సత్కరించారు.
పలుచోట్ల వాగ్వాదాలు..
కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా పలుచోట్ల వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నూతన సర్పంచ్ భర్త ఫొటోను పెట్టారు. దీంతో మహిళా వార్డు సభ్యులు తమ భర్తల ఫొటోలు ఫ్లెక్సీలో ఎందుకు పెట్టలేదని వాగ్వాదానికి దిగారు.
ఈ విషయంపై అధికారులు మహిళా వార్డు సభ్యులను బుజ్జగించడంతో కొద్దిసేపటి తర్వాత వివాదం సద్దుమణిగింది. వర్గల్, జగదేవ్పూర్గ్రామాల్లో నూతన సర్పంచ్ ప్రమాణస్వీకారం సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరులో సర్పంచ్ ప్రమాణ స్వీకారం అనంతరం వార్డు మెంబర్ల సన్మానం సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు.
