ఏపీకి ఎదురుదెబ్బ.. సంగమేశ్వరం ఆపండి..

ఏపీకి ఎదురుదెబ్బ.. సంగమేశ్వరం ఆపండి..

పర్యావరణ అనుమతులు తప్పనిసరి: ఎన్జీటీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్‌‌ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌(ఎన్‌‌జీటీ)లో ఎదురుదెబ్బ తగిలింది. పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ విస్తరణ, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీమ్ లను ఆపాల్సిందేనని ఎన్‌‌జీటీ చెన్నై బెంచ్‌‌ స్పష్టం చేసింది. నారాయణపేట జిల్లా బాపన్‌‌పల్లికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌పై సెప్టెంబర్‌‌ 3న వాదనలు ముగియగా గురువారం తీర్పు ఇచ్చింది. ఎన్‌‌జీటీ జ్యుడీషియల్‌‌ మెంబర్‌‌ జస్టిస్‌‌ కె. రామకృష్ణన్‌‌, టెక్నికల్‌‌ మెంబర్‌‌ సైబల్‌‌ దాస్‌‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం 134 పేజీల జడ్జిమెంట్ ను వెలువరించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారని, వాటిని ఆపాలని ఇదివరకే కేంద్ర జలశక్తి శాఖ ఏపీని ఆదేశించిందని ఎన్‌‌జీటీ గుర్తు చేసింది. ప్రాజెక్టుకు ఎన్విరాన్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌‌ కూడా తప్పనిసరి అని తేల్చిచెప్పింది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించినట్టుగా కొత్త ప్రాజెక్టుల డీటైల్డ్‌‌ ప్రాజెక్టు రిపోర్ట్‌‌ (డీపీఆర్‌‌)లు కేఆర్‌‌ఎంబీకి సమర్పించి బోర్డుతో పాటు సీడబ్ల్యూసీ టెక్నికల్‌‌ అప్రైజల్‌‌ తీసుకోవాలని ఆదేశించింది.

ఏపీ రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ ప్రకారం ప్రాజెక్టుకు అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. తాము చేపడుతున్నది కొత్త ప్రాజెక్టు కాదన్న ఏపీ వాదనను గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కొట్టిపారేసింది. ఇది తాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, సాగునీటిని తరలించడానికి చేపట్టిందని తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టుకు ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ తప్పనిసరి అని తెలిపింది. సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీమ్​కు ముందస్తు పర్యావరణ అనుమతులు అక్కర్లేదన్న ఎక్స్‌పర్ట్‌ కమిటీ నివేదికతోనూ ఎన్‌జీటీ విభేదించింది. ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నం విషయంలో ఒకలా, రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్ విషయంలో మరోలా ఎక్స్‌పర్ట్‌ కమిటీ రిపోర్ట్ చేసిందని గుర్తు చేసింది. ఏపీ చేపట్టిన ప్రాజెక్టుల్లో పంపుహౌస్‌తో పాటు కొత్త నిర్మాణాలు ఉన్నాయని, కాలువలను పెద్ద ఎత్తున విస్తరిస్తున్నారని, దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందని ఎన్‌జీటీ అభిప్రాయపడింది. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లాలన్న కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను పాటించాలని చెప్పింది.

ఏపీ స్పీడ్‌కు బ్రేకులు

ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుపై నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు సంగమేశ్వరం లిఫ్ట్‌ ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఈ ఏడాది మే 5న 203 జీవో ద్వారా అనుమతులు ఇచ్చింది. ఈ నీటిని తరలించడానికి ఇప్పుడున్న కాలువల కెపాసిటీని పెంచడానికి అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీమ్​కు సంబంధించిన టెండర్లు పూర్తి చేసిన ఏపీ త్వరలోనే పనులు ప్రారంభించడానికి రెడీ అవుతున్న టైమ్​లో ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎన్‌జీటీ తీర్పు వచ్చింది. ఎన్‌జీటీ తీర్పుతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ టెండర్ల ప్రక్రియ చేపట్టే అవకాశం ఇప్పట్లో లేదు. ఈ ప్రాజెక్టుల విషయంలో దూకుడుగా వెళ్తున్న ఏపీ సర్కారుకు ఎన్​జీటీ బ్రేకులు వేసింది.

ఆలస్యంగా స్పందించిన తెలంగాణ

ఏపీ  ప్రభుత్వం 203 జీవో ద్వారా అక్రమ ప్రాజెక్టులు చేపట్టేందుకు పర్మిషన్ ఇచ్చినా తెలంగాణ సర్కార్ మొదట్లో పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరిన ప్రతి చుక్క నీటిని రాయలసీమకు మళ్లించడానికి ఏపీ చేస్తోన్న ప్రయత్నాలు, ఆ ప్రాజెక్టులు పూర్తయితే దక్షిణ తెలంగాణపై పడే ఎఫెక్ట్ పై ‘‘వీ6 వెలుగు’’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో సర్కార్​పై పొలిటికల్ ప్రెజర్ పెరిగి ఏపీ ప్రాజెక్టులను ఆపాలంటూ కేఆర్‌ఎంబీకి కంప్లైంట్ చేసింది. ఏపీ ప్రాజెక్టులను ఆపాలంటూ ఒక రైతు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నా మొదట్లో తెలంగాణ సర్కారు పట్టించుకోనట్టు వ్యవహరించింది. వాదనలు ముగిసి జడ్జిమెంట్‌ ఇచ్చే టైమ్​లో కేసును రీ ఓపెన్‌ చేసి తమ వాదనలు కూడా వినాలని ఎన్‌జీటీని ఆశ్రయించింది. పిటిషనర్‌కు తోడు తెలంగాణ సర్కార్ చేసిన వాదనలు, పర్మిషన్‌లు లేకుండా పనులు చేపట్టొద్దన్న కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను పరిగణలోకి తీసుకొని ఎన్‌జీటీ తీర్పును వెలువరించింది.

For More News..

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్​ పాసైతే చాలు ఇంజనీరింగ్‌లో చేరొచ్చు

కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తే రూ. 29 లక్షల జీతం