- ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ సంగీత సత్యనారాయణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో చేపట్టే ఉద్యోగ నియామకాలపై వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా ఎన్‌హెచ్‌ఎం కింద ఉన్న ఖాళీల భర్తీ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఎన్‌హెచ్‌ఎం మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారులు, జిల్లా ప్రధాన హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు ఎన్‌హెచ్‌ఎం కింద ప్రస్తుతం ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టకూడదు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నియామక ప్రక్రియను పూర్తిగా నిలిపి వేయాలి. ఈ ఆదేశాలను క్షేత్రస్థాయి అధికారు లు కచ్చితంగా పాటించాలని, ఇందులో ఎలాం టి మినహాయింపులు ఉండకూడదని కమిషనర్ తన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.
