పరువు హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ 

పరువు హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ 

సరూర్ నగర్లో పరువు హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పట్టపగలే భార్య సోదరుడు దాడి చేసి యువకున్ని దారుణంగా హత్య చేసిన ఘటనను సుమోటోగా స్వీకరించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించిన ఎన్హెచ్ఆర్సీ అందరూ చూస్తుండగానే దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన చట్టాన్ని లెక్కచేయకపోవడంతో పాటు మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయపడింది. ఈ ఘటనకు సంబంధించి నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. పరువు హత్య ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. మరోవైపు కేసు దర్యాప్తు వివరాలను సమర్పించాలని, మృతుని భార్య రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయం ఏమైనా అందించారో చెప్పాలని డీజీపీని ఆదేశించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కమిషన్ కు వెల్లడించాలని చెప్పింది. 

మరోవైపు పరువు హత్య ఘటనపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది. ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నందుకు దళిత యువకున్ని కొట్టి చంపిన ఘటనపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ చేసిన ట్వీట్పై కమిషన్ స్పందించింది.