ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ నిరసనలపై ..ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ బహిరంగ విచారణ

ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ నిరసనలపై ..ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ బహిరంగ విచారణ
  • 28న హైదరాబాద్‌‌లో  జరపనున్నట్టు అధికారులకు సమాచారం
  • రైతులపై నమోదైన కేసుల వివరాలతో వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన రైతులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి నిర్బంధించారన్న ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ) స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి జులై 28న హైదరాబాద్‌‌లో ఉదయం 10 గంటలకు బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ వెల్లడించింది. విచారణ కార్యాలయ వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

 రైతులపై నమోదైన కేసుల వివరాలకు సంబంధించిన సమగ్ర నివేదికను వారంలోగా సమర్పించాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌‌లను ఆదేశించింది. జూన్ 5న న్యాయవాది ఇమ్మనేని రామారావు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌‌హెచ్‌‌ఆర్‌‌సీ కేసు నమోదు చేసింది. రైతులపై అక్రమ కేసులు, పోలీసు దౌర్జన్యం ఆరోపణలపై విచారణకు సిద్ధమైంది. బాధిత రైతులు, వారి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు జులై 28న జరిగే బహిరంగ విచారణలో పాల్గొనాలని కమిషన్ సూచించింది. ఈ విచారణకు సంబంధించిన ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్, డీజీపీ, పిటిషనర్ రామారావుకు బుధవారం సమాచారం అందించింది.