- కంప్లైంట్లో రిమ్స్ పసికందుల సజీవ దహనం ఘటన ప్రస్తావన
- పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ )లో కంప్లైంట్ నమోదైంది. వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా నిరుపేద రోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ హైకోర్టు న్యాయవాది వినోద్ హిందుస్థానీ బుధవారం ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో పసికందుల మరణాలు, కుప్పకూలుతున్న భవనాలు, కనీస సౌకర్యాల లేమిపై పిటిషన్ లో ప్రస్తావించారు. ప్రధానంగా ఆదిలాబాద్ రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్ఎన్సీయూ) లో ఏసీల నిర్వహణ లోపం, షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు పసికందులు సజీవ దహనమైన ఘటనను పిటిషన్‌లో పేర్కొన్నారు.
750 పడకల ఆసుపత్రికి కేవలం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు మాత్రమే ఉండటం వ్యవస్థాగత వైఫల్యాన్ని స్పష్టం చేస్తోందన్నారు. వరంగల్ ఎంజీఎంలోనూ తగినన్ని రేడియంట్ వార్మర్లు, ఇంక్యుబేటర్లు లేక ఒకే వార్మర్‌లో ఇద్దరు ముగ్గురు శిశువులకు చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వార్డుల్లో పెచ్చులూడి రోగుల నెత్తిన పడుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడం, ఐసీయూల్లోకి సైతం ఎలుకలు చేరి రోగులను కొరకడం, ఆవరణలో కుక్కల సంచారం రోగుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
పడకలు చాలక గర్భిణులు, వృద్ధులు నేలపైనే పడుకుని చికిత్స పొందుతున్న అమానవీయ పరిస్థితులు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు (ఆర్టికల్ 21) ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ (కేసు డైరీ 112620/CR/2026) కేసును నమోదు చేసి విచారణకు స్వీకరించింది.
