మహారాష్ట్ర, కర్నాటకలో ఎన్ఐఏ సోదాలు.. ఐఎస్ లీడర్ సహా 15 మంది అరెస్టు

మహారాష్ట్ర, కర్నాటకలో  ఎన్ఐఏ సోదాలు.. ఐఎస్ లీడర్ సహా 15 మంది అరెస్టు
  • దేశంలో టెర్రర్ దాడులకు నిందితుల కుట్ర 
  • ఒకేసారి 44 ప్రాంతాల్లో రెయిడ్స్  
  • భారీగా డబ్బు, వెపన్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు

న్యూఢిల్లీ: టెర్రర్ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) శనివారం మహారాష్ట్ర, కర్నాటకలో సోదాలు నిర్వహించింది. టీమ్ లు గా విడిపోయి ఒకేసారి 44 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఐఎస్ మాడ్యూల్ లీడర్ సహా 15 మంది టెర్రరిస్టులను అరెస్టు చేసింది. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బు, ఆయుధాలు, డిజిటల్ డివైజెస్, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. మహారాష్ట్రలోని పడ్ఘ–బోరివాలి, థానె, మీరా రోడ్, పుణెతో పాటు కర్నాటకలోని బెంగళూర్ లో రెయిడ్స్ నిర్వహించినట్టు ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు. ఫారిన్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఐఎస్ మహారాష్ట్ర మాడ్యూల్ పని చేస్తున్నదని చెప్పారు. నిందితులు టెర్రర్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దేశంలో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు ఐఈడీ బాంబులు తయారు చేస్తున్నారని  పేర్కొన్నారు. ఈ మాడ్యూల్ లీడర్, కీలక నిందితుడు సాకీబ్ నాచన్.. యువతను ఐఎస్ లో చేర్చుకుని ట్రైనింగ్ ఇస్తున్నాడని వివరించారు. 

పడ్ఘ కేంద్రంగా కుట్ర.. 

పడ్ఘ- అనేది థానె జిల్లాలోని ఒక గ్రామం. ఈ గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని మహారాష్ట్ర ఐఎస్ మాడ్యూల్ పని చేస్తున్నది. నిందితులు పడ్ఘ-ను తమకు తాము స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించుకున్నారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఓ వర్గం యువతను సంస్థలో చేర్చుకుంటున్నారు. ఐఎస్ లో చేరుతున్న యువతను అక్కడే ఉండాలని ఆదేశిస్తూ పడ్ఘ బేస్ ను పటిష్టం చేసుకున్నారు. ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. దేశంలో శాంతి సామరస్యాన్ని చెడగొట్టేందుకు కుట్ర పన్నారు. ‘జిహాద్’ పేరుతో దేశంపై యుద్ధం ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో టెర్రర్ దాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రచించారు. 

వరుస దాడులు.. 

ఐఎస్ ఒక అంతర్జాతీయ టెర్రర్ సంస్థ. ఇది మన దేశంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నింది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఐఎస్ మాడ్యూల్స్, సెల్స్ ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఐఏ.. గత కొన్ని నెలలుగా వరుసగా దాడులు నిర్వహిస్తూ ఐఎస్ మాడ్యూల్స్ ను పట్టుకుంటున్నది. ఇప్పటికే పదుల సంఖ్యలో టెర్రరిస్టులను అరెస్టు చేసింది. ఈ ఏడాది మొదట్లో మహారాష్ట్ర మాడ్యుల్ పై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ.. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా రెయిడ్స్ నిర్వహిస్తూ ఐఎస్ నెట్ వర్క్ ను ఛేదిస్తున్నది.