హైదరాబాద్, వెలుగు: మేడ్చల్‌లో పట్టుబడిన ఐసిస్ ఆకర్షితుడు జాయిద్ ఖాన్ అలియాస్ ఆదిల్ ఖాన్ టెర్రర్ కేసుపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అంశం కావడంతో ఎన్‌ఐఏ సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా మేడ్చల్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని ఎన్‌ఐఏ అధికారులు ఇప్పటికే సేకరించారు. మరోవైపు రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కూడా జాయిద్ ఖాన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రాబడుతోంది..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాయిద్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో బొమ్మ తుపాకీతో రీల్స్ చేసేవాడు. ఈ క్రమంలోనే అతను పాకిస్తాన్‌కు చెందిన సవాజాద్ భట్టి అనే ఐసిస్ హ్యాండ్లర్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో మేడ్చల్ పోలీసులు ఆదివారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దేశ రక్షణకు సంబంధించిన తీవ్రమైన అంశం కావడంతో ఎన్‌ఐఏ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనుంది. త్వరలోనే కోర్టు అనుమతితో జాయిద్ ఖాన్‌ను కస్టడీకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయి.
