
- సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా నైజీరియన్లు
- ఫారెక్స్ ట్రేడర్లు, హవాలా బ్రోకర్లతో మిలాఖత్
- ఐదేండ్లలో రూ.500 కోట్లు దేశం దాటినట్లు గుర్తించిన ఈగల్ ఫోర్స్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలు, డ్రగ్స్ దందాలకు నైజీరియన్లు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. కొకైన్ సహా నిషేధిత సింథటిక్ డ్రగ్స్ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అమెరికా, యూరప్ నుంచి కొకైన్, ఫ్రాన్స్, బెల్జియం, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ నుంచి క్రిస్టల్ మెత్, ఎక్స్‌టసీ, యాంఫెటమైన్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ వంటి సింథటిక్ డ్రగ్స్ ఇండియాకు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నివాసం ఉంటున్న నైజీరియన్లతో వీటిని సప్లయ్ చేస్తున్నారు. ఇలా డ్రగ్స్ అమ్మకాలతో సంపాదించిన డబ్బును ఇంటర్నేషనల్ ఫారెక్స్ ట్రేడర్లు, హవాలా ఏజెంట్ల ద్వారా నైజీరియాకు తరలిస్తున్నారు.
ఇందుకు గాను హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూర్, రాజస్థాన్, గుజరాత్, గోవాలోని హవాలా వ్యాపారులతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి వారం దాదాపు రూ.2 కోట్ల మేర నైజీరియాకు మనీ లాండరింగ్ చేస్తున్నారు. ఇలా ఐదేండ్లలో రూ.500 కోట్లు హవాలా జరిగినట్లు ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో వెలుగు చూసింది.
క్లాత్ బిజినెస్ మాటున హవాలా
డ్రగ్స్ సహా సైబర్ నేరాల ద్వారా కొల్లగొడుతున్న డబ్బును క్లాత్ బిజినెస్‌పై ముంబైకి వచ్చే నైజీరియన్స్ ద్వారా తరలిస్తున్నారు. ఇందుకోసం బేబీ ఫ్రాక్‌లు, కుర్తాలు, టీ-షర్టులు, కిరాణ వస్తువులు, తల వెంట్రుకలను ఎక్స్‌పోర్ట్‌తో ఫేక్ ఇన్‌వాయిస్‌లు తయారు చేయిస్తున్నారు. ముంబై, చెన్నై నుంచి కార్గో షిప్‌ల ద్వారా ట్రాన్స్‌పోర్టు చేస్తున్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇందుకు గాను ప్రతిదశలోనూ ఎవరికి వారు 25 శాతం నుంచి 40 శాతం వరకు కమీషన్లు తీసుకుంటూ మనీలాండరింగ్ చేస్తున్నారు. సాధారణంగా ఫారెక్స్ ట్రేడర్లు నిర్వహించే వెస్ట్రన్ యూనియన్, రియా మనీ, మనీగ్రామ్ ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేవలం 30 ట్రాన్సాక్షన్లు మాత్రమే నిర్వహించే అవకాశాలున్నాయి. దీంతో హవాలా రూపంలో నైజీరియాకు తరలిస్తున్నారు.
కొకైన్, ఎక్స్‌టసీ డ్రగ్స్‌ను విక్రయిస్తున్న నైజీరియన్ మాక్స్‌వెల్‌ను ఇటీవల టీజీ ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. డ్రగ్స్ అమ్మకాల ద్వారా జరిపిన 150 లావాదేవీలను గుర్తించింది. ఆర్గనైజ్డ్ హవాలా నెట్‌వర్క్ ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. గోవా, ముంబై, ఢిల్లీలోని స్థానిక హవాలా ఆపరేటర్ల ద్వారా వారానికి దాదాపు రూ.2.1 కోట్లు దేశం దాటిస్తున్నట్లు గుర్తించారు. గత వారం మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, గోవా, ఢిల్లీలోని హవాలా వ్యాపారులపై ఆపరేషన్లు నిర్వహించారు. 20 మంది డ్రగ్ మనీ లాండర్లు, ఏజెంట్లను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో రూ.3.84 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.’’
డ్రగ్ డెలివరీ తర్వాత యూఎస్ అకౌంట్లకు డబ్బులు
మెయిన్ సప్లయర్లు నైజీరియాలోనే ఉంటూ ఇండియా, అమెరికాలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు. ఇండియాలో నివాసం ఉంటున్న నైజీరియా సహా ఇతర సౌత్ ఆఫ్రికన్లతో డ్రగ్స్, సైబర్ నేరాలకు నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. అమెరికాలో డ్రగ్స్ దందా కోసం అమెరికన్లకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులను సేకరిస్తున్నారు. స్థానిక కస్టమర్లకు డ్రగ్ డెలివరీ చేసిన తర్వాత ఆయా అకౌంట్లలో డిపాజిట్ అయ్యే డబ్బును ఇండియాకు తరలిస్తున్నారు. ఇందుకు గాను హైదరాబాద్‌లోని వెస్ట్రన్ యూనియన్, రియా మనీ, మనీగ్రామ్ లాంటి ఏజెన్సీలను వినియోగిస్తున్నారు. ఇలా ఇండియాకు చేరిన అమెరికా డాలర్లను హవాలా రూపంలో అబ్రాడ్ మీదుగా నైజీరియాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.