
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనే పనిలో చాలా మంది శాస్త్రవేత్తలు నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైజీరియా సైంటిస్టులు వ్యాక్సిన్ కనుగొన్నారనే వార్త ఆసక్తి కలిగిస్తోంది. ఇది పూర్తిగా నిజం కానప్పటికీ.. సార్స్–కొవ్–2 వైరస్ ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో ఈ వ్యాక్సిన్ బాగా పని చేస్తుందని ది గార్డియన్ నైజీరియా నివేదిక ప్రకారం తెలిసింది. రిపోర్ట్ ప్రకారం.. అడెలెకె యూనివర్సిటీలో ఇమ్యునాలజీ అండ్ బయో ఇన్ఫార్మాటిక్స్‌లో మెడికల్ వైరాలజీ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్ ఒలాడిపో కోలావాలే నాయకత్వంలో వ్యాక్సిన్‌పై రీసర్చ్ జరుగుతోంది. ఆఫ్రికన్స్ కోసం ఆఫ్రికాలో స్థానికంగా కరోనా వ్యాక్సిన్‌ను డెవలప్ చేస్తున్నామని కోలావొలే ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. వ్యాక్సిన్ కోసం తమ సైంటిస్టుల టీమ్ చాలా కష్టపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంకా పేరు పెట్టని ఈ వ్యాక్సిన్ అందుబాటులో రావడానికి సుమారు 18 నెలల సమయం పట్టొచ్చన్నారు. దీని గురించి పలు అధ్యయనాలు, విశ్లేషణలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే మెడికల్ అథారిటీస్ నుంచి అప్రూవల్స్ కోసం ఎదురు చూస్తున్నామని స్పష్టం చేశారు. కాగా, కరోనా ట్రీట్‌మెంట్ కోసం వాడే ఓ డ్రగ్ రెండ్రోజుల క్రితం మన దేశంలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫవిపి రవిర్ ఫ్యాబిఫ్లూ అనే ఈ ఔషధాన్ని ముంబైకి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ శనివారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.