
చెన్నై: చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరిన్ సంచలనం సృష్టించాడు. ఇండియా నంబర్ వన్ ప్లేయర్ ఎరిగైసి అర్జున్‌కు షాకిచ్చి టోర్నీలో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన చాలెంజర్స్ సెక్షన్ నాలుగో రౌండ్‌లో సరిన్ 70 ఎత్తుల్లో అర్జున్‌కు చెక్ పెట్టాడు. దాంతో ఈ టోర్నీలో అర్జున్ అజేయ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. మరోవైపు జర్మన్ జీఎం విన్సెంట్ కీమర్.. డచ్ స్టార్ అనిష్ గిరితో డ్రా చేసుకుని 3.5 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
అర్జున్ 2.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మురళి కార్తికేయన్.. జార్డెన్ వాన్ ఫోరెస్ట్‌ను ఓడించగా, ప్రణవ్‌తో విదిత్ సంతోష్ డ్రా చేసుకున్నాడు. చాలెంజర్స్ సెక్షన్‌లో అభిమన్యు పురాణిక్.. ఆర్. వైశాలిని ఓడించి 3.5 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. మరోసారి నిరాశ పరిచిన ద్రోణవల్లి హారిక.. లియోన్ ల్యూక్ మెండొన్‌కా చేతిలో ఓడిపోయింది.