నిఖత్ గోల్డెన్ పంచ్‌.. ఇండియా బాక్సర్లకు 9 స్వర్ణాలు

నిఖత్ గోల్డెన్ పంచ్‌.. ఇండియా బాక్సర్లకు 9 స్వర్ణాలు
  • వరల్డ్ కప్‌‌ ఫైనల్స్‌‌ టోర్నీలో మొత్తం 20 పతకాలతో రికార్డు

గ్రేటర్ నోయిడా: తెలంగాణ బిడ్డ, డబుల్ వరల్డ్ చాంపియన్‌‌ నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ కప్‌‌ ఫైనల్స్‌‌లో గోల్డెన్ పంచ్ ఇచ్చింది. అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తూ బంగారు పతకం ఖాతాలో వేసుకుంది. ఈ మెగా టోర్నీలో పతకాల పంట పండించిన ఇండియా బాక్సర్లు ఏకంగా తొమ్మిది గోల్డ్ సహా 20 మెడల్స్‌‌తో రికార్డు సృష్టించారు.

ఏడుగురు అమ్మాయిలు స్వర్ణాలు అందుకున్న వేళ  నిఖత్ జరీన్ తనదైన శైలిలో మెరిసింది. గురువారం జరిగిన విమెన్స్‌‌ 51 కేజీల  ఫైనల్లో ఫేవరెట్‌‌గా  బరిలోకి దిగిన నిఖత్ 5–-0తో చైనీస్ తైపీకి చెందిన గువో యి జువాన్‌‌ను చ చిత్తు చేసింది.  రింగ్‌‌లో అద్భుతమైన కంట్రోల్, వింటేజ్ స్టైల్ పంచ్‌‌లతో విరుచుకుపడిన నిఖత్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంగారు పతకాన్ని ముద్దాడింది.

2023 వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత నిఖత్ నెగ్గిన తొలి గోల్డ్ ఇదే కావడం విశేషం. మరోవైపు వరల్డ్ చాంపియన్ జాస్మిన్ లంబోరియా 57 కేజీ ఫైనల్లో 4-1తో పారిస్ ఒలింపిక్ మెడలిస్ట్ వు షి యి (తైవాన్‌‌)ని  ఓడించి సంచలనం సృష్టించింది.  మీనాక్షి (48 కేజీ), ప్రీతి (54 కేజీ), పర్వీన్ (60కేజీ), అరుంధతి (70 కేజీ),  నుపూర్ (80+ కేజీ) కూడా స్వర్ణాలు నెగ్గారు. మీనాక్షి 5–-0తో  ఆసియా చాంప్ ఫర్జోనా (ఉజ్బెకిస్తాన్‌‌)పై గెలవగా.. ప్రీతి 5-–0తో  సిరిన్ (ఇటలీ)ని ఓడించింది.

పర్వీన్ 3-2తో అయకా టగుచి (జపాన్‌‌)పై కష్టపడి నెగ్గగా.. 18 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అరుంధతి 5–-0తో  జకిరోవా (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేసింది. నుపూర్ 3–-2తో ఒల్టినోయ్ (ఉజ్బెకిస్తాన్‌‌)పై గెలిచి తొలి వరల్డ్ బాక్సింగ్ కప్ టైటిల్‌‌ను అందుకుంది. పూజా రాణి (80 కేజీ) ఫైనల్లో ఓడి సిల్వర్‌‌‌‌తో సరిపెట్టింది. ఇక, మెన్స్‌‌లో సచిన్ (60 కేజీ), హితేష్ (70 కేజీ) కూడా బంగారు పతకాలు సాధించారు.

హోరాహోరీగా సాగిన పోరులో అద్భుతంగా పుంజుకున్న హితేష్ 3–-2తో  నుర్బెక్ ముర్సల్‌‌ (కజకిస్తాన్‌‌)పై  థ్రిల్లింగ్ విక్టరీ కొట్టాడు. సచిన్ 5-0తో మునార్‌‌బెక్ సెయిట్‌‌బెక్‌‌ (కిర్గిస్తాన్‌‌)ను చిత్తు చేశాడు. జాదుమణి సింగ్ (50 కేజీ), పవన్ బర్త్వాల్ (55 కేజీ), అభినాష్ జమ్వాల్ (65 కేజీ), అంకుష్ (80 కేజీ), నరేందర్ బెర్వాల్ (90+ కేజీ)  ఫైనల్స్‌‌లో ఓడి సిల్వర్ మెడల్స్ అందుకున్నారు. ఈ టోర్నీలో పాల్గొన్న 20 మంది ఇండియా బాక్సర్లూ పతకాలు  నెగ్గడం విశేషం.