అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి నిక్కీహేలీ ఔట్

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ  రేసు నుంచి నిక్కీహేలీ ఔట్
  • సూపర్ ట్యూస్ డే ప్రైమరీస్​లో 14 రాష్ట్రాల్లో ట్రంప్​ ఘన విజయం
  • అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ మధ్య పోరు ఖాయం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం మంగళవారం నిర్వహించిన ‘సూపర్ ట్యూస్​డే ప్రైమరీస్’ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. నిక్కీ హేలి మాత్రం ఓడిపోయారు. దీంతో అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె బుధవారం ప్రకటించారు. మొత్తం 15 రాష్ట్రాలు, ఒక టెరిటరీలో ‘సూపర్ ట్యూస్ డే ప్రైమరీస్’ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. 

టెక్సస్, కాలిఫోర్నియాతో పాటు 11 రాష్ట్రాల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ ప్రత్యర్థి, రిపబ్లిక్ పార్టీ క్యాండిడేట్ నిక్కీ హేలి వెర్మాంట్ స్టేట్​లో అద్భుతమైన మెజార్టీ సాధించినప్పటికీ.. మిగతా చోట్ల ఓడిపోయారు. రిపబ్లికన్ ప్రతినిధుల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది సూపర్ ట్యూస్​డే ప్రైమరీస్ ఎన్నికల్లో ఓటేశారు. దీంతో అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకోవాలని హేలీ నిర్ణయించుకున్నారని సమాచారం. 

ట్రంప్​కు 995 మంది ప్రతినిధుల మద్దతు

రిపబ్లిక్​ పార్టీ తరఫున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వంలో గెలవాలంటే ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికైనా ఒకరికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది. సూపర్ ట్యూస్​డే ప్రైమరీస్ ఎన్నికల తర్వాత ట్రంప్ 995 మంది ప్రతినిధుల మద్దతు కూడగట్టుకోగా.. నిక్కీ హేలికి కేవలం 89 మంది డెలిగేట్స్ సపోర్ట్ మాత్రమే దక్కింది. కాగా, డెమోక్రాటిక్‌‌ పార్టీలో అధ్యక్షుడు జో బైడెన్ ‘సూపర్ ట్యూస్ డే ప్రైమరీస్’ ఎన్నికల్లో దాదాపు అన్ని ప్రైమరీల్లో గెలుపొందారు. ఒక్క సమోవా టెరిటరీలో మాత్రమే జేసన్‌‌ పామర్‌‌ చేతిలో ఆయన ఓడిపోయారు. దీంతో అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌‌ ట్రంప్‌‌, జో బైడెన్‌‌ మధ్య పోరు దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తున్నది.