
న్యూఢిల్లీ: యెమెన్ జాతీయుడి హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియను ఉరి తీసే తేదీ ఖరారు అయ్యింది. 2025, జూలై 16న నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. యెమన్ పౌరుడి హత్య కేసులో కేరళకు చెందిన నిమిషా ప్రియకు యెమెన్ అధ్యక్షుడు గత సంవత్సరం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
కేసు ఏంటంటే..?
కేరళలోని పాలక్కడ్‌కు చెందిన నిమిషా ప్రియా 2008లో యెమన్ వెళ్లి అక్కడ నర్సుగా పని చేసింది. అనంతరం 2015లో సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలని ఆలోచించింది. అయితే.. యెమన్ చట్ట ప్రకారం అక్కడ సొంతంగా క్లినిక్ ఓపెన్ చేయాలంటే యెమన్ జాతీయుడి భాగస్వామ్యం అవసరం. దీంతో యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీతో కలిసి ప్రియా క్లినిక్ ప్రారంభించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.
2016లో మహదీపై ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన మహదీ ప్రియాపై వేధింపులకు దిగాడు. అంతేకాకుండా ప్రియా పాస్ట్ పోర్టు తిరిగి ఇవ్వకుండా బెదిరించాడు. దీంతో మహదీ నుంచి ఎలాగైనా పాస్ట్ పోర్టు తిరిగి తీసుకోవాలని భావించిన ప్రియా మరో వ్యక్తికితో కలిసి మహదీకి మత్తు మందు ఇచ్చింది.
మత్తు మందు ఓవర్ డోస్ కావడంతో మహదీ మరణించాడు. దీంతో ప్రియా, ఆమెకు సహయం చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. 2018లో ఈ కేసులో ప్రియాను దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది యెమన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్. ఈ క్రమంలో ప్రియా యెమన్ విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు.
►ALSO READ | అకౌంట్లు బ్లాక్ చేయమని ఆదేశించలేదు: X ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్
యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి కూడా ప్రియాకు ఉరి శిక్ష విధించడాన్ని ఆమోదించాడు. శిక్ష రద్దు కోసం ప్రియా ఫ్యామిలీ పోరాటం చేయగా.. అవేవి ఫలించలేదు. భారత ప్రభుత్వం కూడా ప్రియాకు మరణి శిక్ష విధించడంపై స్పందించింది. ఆమె కుటుంబ సభ్యులకు అవసరమైన సహయం చేస్తామని హామీ ఇచ్చింది.
ప్రియాను కాపాడటానికి ఉన్న ఏకైక ఆప్షన్ బాధితుడి కుటుంబానికి పరిహారం అని కూడా పిలువబడే 'బ్లడ్ మనీ' విధానం. బ్లడ్ మనీ విధానం కింద బాధితుడి కుటుంబ నష్టం పరిహారం తీసుకుని ప్రియాకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. ప్రస్తుతం ప్రియా తల్లిదండ్రులు, లాయర్లు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. మరీ ప్రియాకు ఉరి శిక్ష తేదీ ఖరారు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి.