అకౌంట్లు బ్లాక్ చేయమని ఆదేశించలేదు: X ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్

అకౌంట్లు బ్లాక్ చేయమని ఆదేశించలేదు: X ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్

న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ఇండియాలో బ్లాక్ చేయడం వివాదానికి దారి తీసింది. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకే రాయిటర్స్ ఎక్స్ అకౌంట్‎ను బ్లాక్ చేశామని ఎక్స్ సంస్థ చెప్పగా..  ఎక్స్ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాయిటర్స్ ఎక్స్ ఖాతాను బ్యాన్ చేయాలని సదరు సంస్థను మేం ఆదేశించలేదని క్లారిటీ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. ఇదిలా ఉండగానే తాజాగా భారత ప్రభుత్వంపై ఎక్స్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. 

2025, జూలై 3న అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌తో సహా 2,355 ఖాతాలను గంటలోపు బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించిందని ఎక్స్ ఆరోపించింది. ఎటువంటి కారణం లేకుండానే ఆ ఖాతాలను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంది ఎక్స్. భారత ప్రభుత్వ ప్రెస్ సెన్సార్‌షిప్‎పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామంది ఎక్స్. ఈ క్రమంలో ఎక్స్ ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. రాయిటర్స్‎తో సహా ఏ ఎక్స్ అకౌంట్‎ను బ్లాక్ చేయమని ఆదేశించలేదని క్లారిటీ ఇచ్చింది. 

ALSO READ | ఇప్పుడు ప్రపంచానికి ఏ పెద్దన్న అవసరం లేదు: ట్రంప్ వార్నింగ్పై బ్రెజిల్ కౌంటర్

‘‘2025, జూలై 3న పలు ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఎలాంటి ఆర్డర్ జారీ చేయలేదు. అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్, రాయిటర్స్ వరల్డ్‌తో సహా ఏ ప్రముఖ అంతర్జాతీయ వార్తా ఛానెల్‌లను బ్లాక్ చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. భారత్‎లో రాయిటర్స్, రాయిటర్స్ వరల్డ్ ఎక్స్ ఖాతాలు బ్లాక్ చేసిన వెంటనే వాటిని అన్‌బ్లాక్ చేయమని 'X'కి ప్రభుత్వం లేఖ రాసింది. కానీ ఎక్స్ ఈ ప్రక్రియలో ఉన్న సాంకేతిక అంశాలను అనవసరంగా ఉపయోగించుకుని అకౌంట్లను అన్‌బ్లాక్ చేయలేదు. 

భారత ప్రభుత్వ ఒత్తిడితో ఎక్స్ చివరకు జూలై 6, 2025 రాత్రి 9 గంటల తర్వాత రాయిటర్స్, ఇతర ఖాతాలను అన్‌బ్లాక్ చేసింది. రాయిటర్స్‌ను అన్‌బ్లాక్ చేయడానికి ఎక్స్ 21 గంటలకు పైగా తీసుకుంది’’ అని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతంలో కూడా భారత ప్రభుత్వంపై ఎక్స్ ఇవే తరహా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2025 మార్చిలో భారత ప్రభుత్వంపై ఎక్స్ దావా వేసింది. చట్టవిరుద్ధమైన బ్లాకింగ్ పాలన సృష్టించడానికి సమాచార సాంకేతిక చట్టాలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎక్స్ ఆరోపించింది.