
అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే బ్రిక్స్ దేశాలపై అదనంగా 10% టారిఫ్ విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై బ్రెజిల్ తీవ్రంగా మండిపడింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రపంచం ఇప్పుడు మారిపోయిందని, ఈ ప్రపంచానికి ఇప్పుడు ఏ చక్రవర్తి అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
అగ్ర రాజ్యంగా పేర్కొనే అమెరికాను ఇన్నాళ్లు ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యామ్నయ మార్గాన్ని అన్వేషించే దేశాలు ఈ బ్రిక్స్ వేదికపైకి వచ్చాయని.. ఈ ఆలోచన లేని వ్యక్తులకు బ్రిక్స్ వేదిక అసౌకర్యంగానే ఉంటుందని బ్రెజిల్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై బ్రిక్స్ దేశాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
బ్రిక్స్ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ కామెంట్లను చైనా కూడా తీవ్రంగా ఖండించింది. బ్రిక్స్ దేశాలతో ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారని మండిపడింది. అమెరికాతో బ్రిక్స్ ఘర్షణ కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలపై అమెరికా ఒత్తిడి తీసుకొస్తున్నదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మండిపడ్డారు. టారిఫ్ విధింపు విషయంలో తమ స్పందనలో ఏ మార్పూ లేదని తెలిపారు. టారిఫ్ వార్లో విజేతలు ఉండరనే విషయాన్ని ట్రంప్ తెలుసుకోవాలని అన్నారు.
అమెరికా విధిస్తున్న టారిఫ్లను విమర్శిస్తూ బ్రిక్స్ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడంపై ట్రంప్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. బ్రిక్స్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే, అమెరికాకు వ్యతిరేకంగా బ్రిక్స్ విధానాలేంటో మాత్రం ట్రంప్ వివరించలేదు. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసేలా కొత్త కరెన్సీని సృష్టించడం లేదా డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని సమర్థించడం వంటి చర్యలపై బ్రిక్స్ దేశాలు చర్చిస్తుండటంపై ట్రంప్లో అసహనం అంతకంతకూ పెరిగిపోతోంది.