నిమ్స్ కు పేషెంట్ల రష్..2023తో పోలిస్తే 2024లో 12 శాతం పెరిగిన ఔట్ పేషెంట్లు

నిమ్స్ కు పేషెంట్ల రష్..2023తో పోలిస్తే 2024లో 12 శాతం పెరిగిన ఔట్ పేషెంట్లు
  • మొత్తం సర్జరీల్లో 15 శాతం పెరుగుదల
  • సీఎంఆర్ఎఫ్  కింద చికిత్సల్లో 98 శాతం వృద్ధి
  • నిమ్స్​ సిబ్బంది సేవలు అభినందనీయం
  • ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​లో  మంత్రి దామోదర ప్రశంస
  • 800 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: పేదోళ్ల కార్పొరేట్  హాస్పిటల్​గా పేరుగాంచిన నిమ్స్  ఆసుపత్రికి పేషెంట్ల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది. దగ్గు, జలుబు లాంటి చిన్నచిన్న అనారోగ్య సమస్యల నుంచి గుండెమార్పిడి ఆపరేషన్లు, రోబోటిక్  చికిత్సల వరకు అన్నిరకాల సేవలు అందిస్తున్న నిమ్స్  ప్రజల మన్ననలు పొందుతోంది. శుక్రవారం సెక్రటేరియెట్ లో జరిగిన నిమ్స్  ఎగ్జిక్యూటివ్​ బోర్డు మీటింగ్​లో వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా నిమ్స్​ సిబ్బందిని అభినందనల్లో ముంచెత్తారు. ఎంతో నమ్మకంతో  సుదూర ప్రాంతాల నుంచి నిమ్స్ కు చికిత్స కోసం వచ్చేవారి నమ్మకాన్ని నిలబెడుతున్నారని డాక్టర్లు, సిబ్బందిని ఆయన ప్రశంసించారు. 

మంత్రి మాట్లాడుతూ నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని డాక్టర్లకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో హెల్త్  సెక్రటరీ క్రిస్టినా జడ్  చోంగ్తూ, నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డైరెక్టర్  బీరప్ప, ఇతర  ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2023–--24 నివేదికను మంత్రికి బీరప్ప అందించారు. ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ కు మంత్రి గ్రీన్ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చికిత్స అందించినందుకు, నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆరోగ్యశ్రీ నుంచి వచ్చే డబ్బుల్లో 35 శాతం ఇకపై డాక్టర్లకు, వైద్య సిబ్బందికి అందించనున్నారు. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నందున ఇందుకు తగ్గట్లు డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కోసం 800కు పైగా పోస్టుల భర్తీకి మంత్రి అనుమతి ఇచ్చారు. 

ఆరోగ్యశ్రీ ఓపీ 22.4 శాతం అప్

నిమ్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల విలువైన వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వివిధ చికిత్సలను, ప్రైవేటు   ఆసుపత్రుల్లో లక్షల విలువైన వైద్యాన్ని నిమ్స్ లో అతితక్కువ ఖర్చుతో అందిస్తున్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. దీంతో పేదలకు ఎంతటి ఆనారోగ్య సమస్య వచ్చినా.. ఆరోగ్యశ్రీ ద్వారా నయం చేసుకునే వెలుసుబాటు కలిగింది. సాధారణ అడ్మిషన్లతో పాటు 2023తో పోలిస్తే 2024లో ఆరోగ్యశ్రీ ఓపీ 22.4 శాతం పెరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ అడ్మిషన్లు కూడా 22 శాతం పెరిగాయి.

సీఎంఆర్ఎఫ్ కు కేరాఫ్  నిమ్స్

నిమ్స్  ఆసుపత్రిలో ఎల్ఓసీ, సీఎంఆర్ఎఫ్  ద్వారా గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్, క్యాన్సర్, న్యూరో, ఆర్థోపెడిక్  సర్జరీలు, అత్యవసర వైద్య సేవలు వంటి ఖర్చుతో కూడిన చికిత్సలు ఉచితంగా, సబ్సిడీ రేట్లతో అందిస్తున్నారు. 2023 లో సీఎంఆర్ఎఫ్ ద్వారా 5,868 చికిత్సలు అందించగా, 2024లో అది 11,105 చికిత్సకు చేరింది. ఏకంగా 98 శాతం సీఎంఆర్ఎఫ్  చికిత్సలు పెరగడం విశేషం.