- 90కి చేరిన ఎమర్జెన్సీ అడ్మిషన్లు.. ఒకే రోజు 306 మంది ఇన్‌పేషెంట్లు
- ఓపీ రిజిస్ట్రేషన్ సమయం మధ్యాహ్నం 2 గంటల వరకు పెంపు
హైదరాబాద్, వెలుగు: నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) హాస్పిటల్‌కు రోగులు పోటెత్తుతున్నారు. గత నెల రోజులుగా ఓపీ, ఐపీ సేవలతో పాటు వైద్య పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది. గతంలో నిమ్స్‌లో రోజుకు సగటున 3,500 మంది వరకు ఓపీకి వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 5 వేలు దాటుతోంది. ఈ నెల 5న ఒక్కరోజే ఏకంగా 5,635 మంది ఓపీ సేవలు పొందినట్లు హాస్పిటల్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
ఒక్కరోజే 5,088 మందికి టెస్టులు..
ఓపీతో పాటు ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, ఐపీ విభాగాల్లోనూ రోగుల రద్దీ పెరిగింది. ఈ నెల 5న ఒక్కరోజే అత్యధికంగా 5,088 మంది వివిధ రకాల డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకున్నారు. అదే రోజు 306 మంది రోగులు అడ్మిట్ అయి ఇన్‌పేషెంట్ విభాగంలో చేరారు. ఎమర్జెన్సీ విభాగంలోనూ అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. గతంలో రోజుకు సగటున 50 మంది వరకు ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 80 నుంచి 90కి చేరినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ..
నిమ్స్‌లో ఓపీ రిజిస్ట్రేషన్ సమయాన్ని పెంచడంతో పాటు సేవలను విస్తరించడం కూడా రోగుల రద్దీ పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. గతంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఓపీ రిజిస్ట్రేషన్లు చేసేవారు. ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో జిల్లాల నుంచి వచ్చే రోగులకు ఇబ్బందులు కొంత తగ్గాయని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు వివిధ రక్త, ఇతర వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను కూడా అదే రోజు రోగులకు అందిస్తున్నట్లు నిమ్స్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
