- గతంలో మూతపడిన చోట కొత్త గనుల రీస్టార్ట్‌కు ఏర్పాట్లు
- ఈ ఏడాది మూడు, వచ్చే ఏడాది రెండు గనులు ప్రారంభించనున్న యాజమాన్యం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే బొగ్గు తవ్వకాలు పూర్తిచేసుకొని మూతబడిన భూగర్భ గనుల లోతుల్లో ఇంకా మిగిలి ఉన్న బొగ్గు ఖనిజాన్ని వెలికి తీయడానికి 9 కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ ఏడాది మూడు, వచ్చే ఏడాది రెండు గనులు ప్రారంభించడానికి యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న ఓపెన్ కాస్ట్ గనులకు కొనసాగింపుగా వీటిని మొదలుపెట్టనున్నారు. 2027–-28 నాటికి సింగరేణిలో నాలుగు గనులు మూతపడుతున్నాయి.
దీంతో ఏడాదికి 12.51 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. అయితే కొత్తగా ప్రారంభించనున్న 9 ప్రాజెక్టుల వల్ల ఈ లోటును భర్తీ చేసుకునే అవకాశం సింగరేణికి ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో రూపొందించిన 9 కొత్త ప్రాజెక్టుల ద్వారా సింగరేణి సంస్థ మరో 20 సంవత్సరాలకు పైగా బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చే అవకాశం ఏర్పడుతున్నది. కొత్త ప్రాజెక్ట్‌లపై శనివారం సింగరేణి భవన్లో సీఎండీ బుద్దా ప్రకాష్ జ్యోతి అధ్యక్షతన ఉన్నతస్థాయి అధికారుల సమీక్ష జరిగింది. ఇల్లందు ఏరియాలో 19.68 మిలియన్ టన్నుల నిల్వలు గల జేకే ఓపెన్ కాస్ట్ గని, రామగుండ 3 ఏరియాలో 181.60 మిలియన్ టన్నుల గల ఓసీ విస్తరణ ప్రాజెక్ట్, బెల్లంపల్లి ఏరియాలోని 38.98 మిలియన్ టన్నుల గల గోలేటి ఓపెన్ కాస్ట్, 30.34 మిలియన్ టన్నుల గల ఎంవీకే ఓపెన్ కాస్ట్-, మణుగూరు ఏరియాలో 40.45 మిలియన్ టన్నుల గల మణుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్ టెన్షన్, 62 మిలియన్ టన్నుల గల పీకే కోల్ మైన్, కొండాపూర్, -మందమర్రి ఏరియాలో 34.42 మిలియన్ టన్నుల గల ఆర్ కేపీఓసీపీ ఫేజ్-2 పేర్లతో పిలిచే 9 కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నామని సీఎండీ వివరించారు.
