ఇల్లు కూలి.. 9 మంది నిద్రలోనే కన్నుమూశారు

ఇల్లు కూలి.. 9 మంది నిద్రలోనే కన్నుమూశారు

తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేలూరులోని పెర్నంబుట్‌లో ఈరోజు ఉదయం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో తొమ్మిది మంది నిద్రలోనే మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు పిల్లలు, ఒక పురుషుడు ఉన్నారు. క్షతగాత్రులను రక్షించామని తెలిపారు కలెక్టర్‌ టీపీ కుమారవేల్‌ పాండియన్‌. 

ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మంది కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తామని తెలిపారు.

తమిళనాడులో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. చెన్నై, దాని సమీపంలోని జిల్లాలతో సహా తమిళనాడులోని అనేక జిల్లాల్లో పాఠశాలలు మూసివేయబడ్డాయి. గత వారం తమిళనాడులో భారీ వర్షాలకు 10 మందికి పైగా మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన పంటలు నీట మునిగాయి, చెట్లు నేలకూలాయి. 1000 కి పైగా గుడిసెలు దెబ్బతిన్నాయి.