ఈ-ఆఫీస్​ పనుల్లో రాష్ట్రంలో నిర్మల్ జిల్లా ఫస్ట్

ఈ-ఆఫీస్​ పనుల్లో రాష్ట్రంలో నిర్మల్ జిల్లా ఫస్ట్

158 ఆఫీసుల్లో అమలవుతున్న ఈ – ఫైలింగ్‍

500 ఉద్యోగులకు  పేపర్​లెస్ ​డ్యూటీ

పనుల్లో స్పీడ్, పారదర్శకత

నిర్మల్‍, వెలుగు: ప్రభుత్వమైనా, ప్రైవేట్​ కంపెనీలైనా, ఆఫీసర్లయినా, కామన్​ పబ్లిక్​ అయినా ఇప్పుడంతా ఆన్‍లైన్​పైనే ఆధారపడుతున్నారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని అటు అడ్మినిస్ట్రేషన్, ఇటు సేవా రంగాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే  రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్‍ ఆఫీసుల్లో ఈ ఆఫీస్‍ విధానం అమలు చేయాలని గత జులైలో ప్రభుత్వం ఆదేశించింది. కానీ అంతకుముందే నిర్మల్ ​జిల్లాలో ఈ ఆఫీస్​ విధానం అమల్లోకి వచ్చింది. నిర్మల్‍ కలెక్టర్‍గా గత మార్చి నెలలో బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‍ ముషారఫ్‍అలీ ఫారూఖీ ఏప్రిల్​ నుంచే  ఈ ఆఫీస్‍ విధానానికి శ్రీకారం చుట్టారు. కాగితాలు, ఫైళ్లతో సంబంధం లేకుండా పకడ్బందీగా అమలు చేశారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్‍ ఆఫీసుల్లో ఈ ఫైలింగ్‍ విధానంలో ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే ఈ ఆఫీస్‍ విధానంలో నిర్మల్‍ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

158 ఆఫీసుల్లో అమలు

జిల్లా కలెక్టర్‍ ఆధ్వర్యంలో వంద శాతం ఈ ఆఫీస్‍ విధానంలోనే ఉద్యోగులు పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 158 గవర్నమెంట్‍ ఆఫీసుల్లో కొత్త విధానం అమలవుతోంది. కలెక్టర్‍ ఆఫీస్‍తో పాటు నిర్మల్‍, భైంసా ఆర్డీవో ఆఫీసులు, తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్‍, అగ్రికల్చర్‍, హెల్త్​, ఎడ్యుకేషన్​ఇలా జిల్లా ఆఫీసులు మొదలు వివిధ మండల ఆఫీసుల్లో సుమారు 500 మంది ఉద్యోగులు ఈ ఆఫీస్‍ విధానం వినియోగిస్తున్నారు.  ముందుగా ఆయా డిపార్ట్ మెంట్లలో ఎంపిక చేసిన ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ఒక నోడల్‍ఆఫీసర్‍ను  నియమించి మానిటరింగ్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఈ విధానం ఎంతో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఈ ఆఫీస్‍ ద్వారా పేపర్‍ వినియోగం తగ్గింది.  దీంతో ప్రతి నెలా కొన్ని లక్షల రూపాయలు ఆదా అవుతున్నాయి. ఒక్క కలెక్టరేట్‍లోనే ప్రతి నెలా పేపర్‍, పెన్నులు, ఇతర స్టేషనరీ వినియోగం తగ్గిపోవడం వల్ల రూ. లక్షన్నర సేవ్‍ అవుతోందని కలెక్టర్‍ చెబుతున్నారు. టైం కూడా ఆదా అవుతోందని, పనుల్లో స్పీడ్​ పెరిగిందని అంటున్నారు. గతంలో ఒక ఫైల్‍ కదలాలంటే పది పదిహేను రోజులు పట్టేది. ఇప్పుడు గంటల వ్యవధిలో కలెక్టర్​ను చేరుతోంది. కేవలం చెక్కులు, ట్రెజరీకి సంబంధించిన బిల్లులు మాత్రమే పేపర్‍ రూపంలో జరుగుతున్నాయి.

ఆన్​లైన్​ ఫైల్​ కదిలేదిలా..

కింది స్థాయి ఉద్యోగులు మొదలుకొని కలెక్టర్​వరకు ఈ ఆఫీస్‍ను వినియోగిస్తున్నారు. ఈ విధానంలో ఒక ఫైల్‍ని స్కాన్‍ చేసి కంప్యూటర్‍లో ఒక పోర్టల్​లో ఉంచుతారు. తర్వాత ఆన్‍లైన్​లో అప్‍లోడ్‍ చేసి దశలవారీగా ఆయా సెక్షన్లకు పంపిస్తారు. ఈ విధానంలో ఆ ఫైల్‍ను ఎక్కడి నుంచైనా ఆఫీసర్లు పరిశీలించవచ్చు. సదరు సెక్షన్‍ ఆఫీసర్‍ పరిశీలించాక అది ఆ డిపార్ట్​మెంట్ ​హెడ్​కు, అక్కడి నుంచి  కలెక్టర్‍ లాగిన్‍కు  పంపిస్తారు. కలెక్టర్‍ ఆ ఫైల్‍ను పూర్తిగా పరిశీలించి అన్ని

వివరాలు ఉంటే ఆమోదం తెలుపుతారు. ఇలా కింది స్థాయి అధికారి నుంచి కలెక్టర్​ వరకు పేపర్​లెస్​ సేవలు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టరేట్‍తో పాటు కొన్ని ఆఫీసుల్లోని అల్మారాలు మూలకు పెట్టేశారు. పాత ఫైళ్లతో పాటు కొత్త ఫైళ్లను ఎప్పటికప్పుడు స్కాన్‍చేసి ఈ ఆఫీస్‍ విధానంలోకి తీసుకొస్తున్నారు. ఈ విధానంతో అడ్మినిస్ట్రేషన్​, సర్వీస్​లలో అకౌంటబిలిటీ, స్పీడ్​ పెరుగుతాయని  ఆఫీసర్లు చెబుతున్నారు.

 

నిర్మల్​నంబర్‍ వన్

రాష్ట్రంలోనే నిర్మల్​జిల్లా ఈ ఆఫీస్‍ విధానంలో ముందు వరుసలో ఉంది. గత మార్చి నెలలోనే జిల్లాలో ఈ ఆఫీస్‍ విధానం తీసుకువచ్చాం. ఫలితంగా గవర్నమెంట్‍ఆఫీసుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. గతంలో రోజుల తరబడి ఫైళ్లు పెండింగ్‍లో ఉండేవి. ఇప్పుడు తక్కువ సమయంలోనే ఫైళ్లు కదలడం, పనులు ముందుకెళ్లడం జరుగుతోంది. కలెక్టరేట్‍తో పాటు అన్ని ఆఫీసుల్లో ఈ విధానం అమలు చేస్తున్నాం. ప్రతి ఫైల్​స్కాన్‍ చేసి పంపిస్తున్నారు. గతంలో బీర్వాలు, అల్మరాల్లో  సంవత్సరాల తరబడి ఫైళ్లు భద్రపరిచేవారు. ఇప్పుడు ప్రతి ఫైల్‍ను ఆన్‍లైన్‍లో ఉంచుతున్నారు. ఎలాంటి అవసరమైనా వెంటనే ఓపెన్​ చేసి పరిశీలించే అవకాశం ఉంటుంది. –ముషారఫ్​ అలీ ఫారూఖీ,  కలెక్టర్, నిర్మల్​ జిల్లా.