భారతీయ చలనచిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసికెళ్లి సంచలనం సృష్టించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్పుడు ఈ డైరెక్టర్ వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న చిత్రం 'వారణాసి'. ఈ మూవీ ప్రకటన సందర్భంగా జరిగిన సంఘటనలు, సన్నివేశాలను ఉద్దేశిస్తూ ఏకంగా మూడు ఫిర్యాదులు, కేసులు నమోదుకు దారితీశాయి. ఇప్పుడు ఈ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
హనుమంతుడిపై వ్యాఖ్యల వివాదం..
రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ 'వారణాసి'ని రివీల్ చేసిన మెగా ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాజమౌళి కొంత అసహనానికి గురయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ వచ్చి 'హనుమంతుడు వెనకుండి నడిపిస్తాడు, టెన్షన్ పడకు' అని చెప్పారు. సమస్య వచ్చినప్పుడు 'ఇదేనా నడిపించేది' అని నాకు కోపం వచ్చింది. మా ఆవిడ రమకు హనుమంతుడంటే చాలా ఇష్టం, ఆమె హనుమంతుడిని స్నేహితుడిలా భావిస్తుంది. ఆమె మీద కూడా కోపం వచ్చింది అని అన్నారు.
రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా రాజమౌళిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నందిపై మహేష్ బాబు కూర్చోవడంపై అభ్యంతరం
హనుమంతుడిపై వ్యాఖ్యల వివాదం చల్లారకముందే.. హిందూ సంఘాలు రాజమౌళిపై మరో రెండు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందులో మొదటిది... 'వారణాసి' గ్లింప్స్‌లో , పోస్టర్‌లో మహేష్ బాబు నందిపై కూర్చొని కనిపించడం. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే, శివుడి వాహనంగా భావించే నంది విగ్రహంపై హీరోని కూర్చోబెట్టి చూపించడం దేవుళ్లను అవమానించడమేనని వారు ఫిర్యాదులో చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంద్రుడితో యుద్ధంపై కేసు
రాజమౌళి దర్శకత్వం వహించిన మునుపటి బ్లాక్‌బస్టర్ చిత్రం 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' ట్రైలర్‌లో బాహుబలి... ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చూపించడాన్ని కూడా తప్పుబడుతున్నారు.. హిందూ దేవతల ప్రతినిధులుగా భావించే ఇంద్రుడు వంటి దేవతతో హీరో యుద్ధం చేయడం ద్వారా హిందూ మత మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ రాజమౌళిపై కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఒకే దర్శకుడిపై ఇలా వేర్వేరు అంశాలను ప్రస్తావిస్తూ వరుసగా మూడు కేసులు రావడం తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదాలపై రాజమౌళి ఎలా స్పందిస్తారో, మహేష్ బాబు సినిమా 'వారణాసి'కి ఈ వివాదాలు ఎలాంటి చిక్కులు తెచ్చిపెడతాయో చూడాలి.
