కలిసి తాగేందుకు రావట్లేదని చితకొట్టిన ఫ్రెండ్స్.. మనస్థాపంతో గొంతు కోసుకుని యువకుడు సూసైడ్

కలిసి తాగేందుకు రావట్లేదని చితకొట్టిన ఫ్రెండ్స్.. మనస్థాపంతో గొంతు కోసుకుని యువకుడు సూసైడ్

హైదరాబాద్: నార్మల్‎గా ఫ్రెండ్స్‎ను అరే మామ మందు తాపించరా అంటే డబ్బులు లేవంటూ తప్పించుకుంటారు.. ఇప్పటి వరకు మనం ఇలాంటి ఫ్రెండ్స్‎ని ఎంతో మందిని చూశాం. కానీ తమతో కలిసి మందు తాగడానికి రావట్లేదనే కోపంతో ఓ యువకుడిపై ఇద్దరు ఫ్రెండ్స్ విచక్షణరహితంగా దాడి చేశారు. తన ఫ్రెండ్సే చితకబాదటంతో మనస్థాపానికి గురైన యువకుడు బ్లేడ్‎తో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు మన తెలంగాణ రాజధాని హైదరాబాద్‎లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.

పోలీసుల వివరాల ప్రకారం.. బాల్ రాజ్, హరీష్, సందీప్ ముగ్గురు ఫ్రెండ్స్. మద్యానికి బానిసైన ముగ్గురు చోరీలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయితే.. జైలు జీవితం అనుభవించిన తర్వాత సందీప్ తన తప్పు తెలుసుకొని దొంగతనాలకు దూరంగా ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. తమతో దొంగతనాలకు రాకపోవడం, కలిసి మద్యం తాగేందుకు నిరాకరించడంతో సందీప్‎పై బాల్ రాజ్, హరీష్ కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడేది ఉందంటూ సందీప్‎ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు బాల్ రాజ్, హరీష్.

తమతో దొంగతనాలకు, మద్యం తాగేందుకు ఎందుకు రావట్లేదంటూ బాల్ రాజ్, హరీష్ ఇద్దరూ కలిసి సందీప్‎పై విచక్షణరహితంగా దాడి చేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న సందీప్ ఇంటికి వెళ్లి తనపై బాల్ రాజ్, హరీష్ దాడి చేశారని తల్లికి చెప్పాడు. తన ఫ్రెండ్సే తనను విచక్షణరహితంగా కొట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సందీప్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సందీప్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు పోలీసులు.