మెడికల్ షాప్​ల మత్తు దందా ఇష్టారాజ్యాంగా హెచ్ 1 డ్రగ్స్ అమ్మకాలు

మెడికల్  షాప్​ల మత్తు దందా ఇష్టారాజ్యాంగా హెచ్ 1 డ్రగ్స్ అమ్మకాలు
  • నిబంధనలు పాటించని మెడికల్ షాపులు
  • కరువైన నిఘా, తనిఖీలు
  • ఇటీవల ముఠా అరెస్ట్​తో వాస్తవాలు వెలుగులోకి..

నిర్మల్, వెలుగు: మెడికల్​ షాప్​లు, ల్యాబ్​లతో పనిచేసే కొంతమంది మత్తుకు అలవాటు పడుతున్న యువకులను లక్ష్యంగా చేసుకొని మిడజోలం లాంటి మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు, సిరప్​లు అంటగడుతూ వారిని బానిసలుగా మారుస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కొంతమంది ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ ముఠాగా ఏర్పడి అమాయక యువకులకు మత్తు ఇంజక్షన్లు ఇస్తూ నాలుగు రోజుల క్రితం  పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘిస్తూ మత్తు ఇంజక్షన్లు, సిరప్​లు, టాబ్లెట్లను మెడికల్ షాపుల్లో ఇష్టారీతిన అమ్ముతుండడం సమస్య తీవ్రతకు కారణమవుతోంది.

జోరుగా షెడ్యూల్ హెచ్ 1 మత్తుమందుల సేల్స్​

ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ హెచ్ 1బి ప్రకారం మొత్తం 46 రకాల మందులు అమ్మేటప్పుడు  మెడికల్​ షాపుల ఓనర్లు అనేక నిబంధనలు పాటించాల్సి ఉంది. క్వాలిఫైడ్ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ మందులు అమ్మాలి. హెచ్1 రిజిస్టర్​లో తప్పనిసరిగా నమోదు చేయాలి. బిల్లును తప్పనిసరిగా కొనుగోలుదారుడికి ఇవ్వాలి. అయితే జిల్లాలోని అనేక మెడికల్ షాపుల్లో ఈ నిబంధనలను యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు. 

మత్తుమందుల అమ్మకాలపై సంబంధిత ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోకపోవడం మెడికల్ వ్యాపారులకు వరంగా మారింది. నిర్మల్ జిల్లా కేంద్రం, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోని కొన్ని మెడికల్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా షెడ్యూల్ హెచ్ 1 ట్యాబ్లెట్లు, సిరప్​లు అమ్ముతున్నారని ఫిర్యాదులున్నాయి. 

యువకులకు మిడజోలం మత్తు ఇంజక్షన్లు అలవాటు చేసిన ముఠా

 మత్తుకు అలవాటు పడుతున్న యువకులను లక్ష్యంగా చేసుకొని వారికి మిడజోలం అనే ఇంజక్షన్ ను అంటగడుతున్న ముఠాను నిర్మల్ పోలీసులు ఇటీవల చాకచక్యంగా పట్టుకున్న విషయం తెలిసిందే. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్​తోపాటు ఓ విద్యార్థి ఓ ముఠాగా ఏర్పడి మత్తుకు అలవాటు పడుతున్న యువతను లక్ష్యంగా చేసుకొని వారికి మిడజోలం మత్తు ఇంజక్షన్​ను అమ్ముతున్నారు. హాస్పిటల్స్​లో అనస్తీషియా కోసం వినియోగించే ఈ పవర్​ఫుల్​ ఇంజక్షన్​ను యువకులకు అలవాటు చేశారు. కాగా ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు 26 మిడజోలం ఇంజక్షన్లు, సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్​లేకుండానే మెడికల్​ షాపుల యాజమాన్యాలు వీటిని అమ్మినట్లు తెలుస్తోంది. 

ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మకాలు

సరైన తనిఖీలు లేకపోవడంతో అనేక మెడికల్ షాపుల్లో ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండానే విచ్చలవిడిగా మందులు అమ్ముతున్నారు. ప్రతి మెడికల్ షాపులో తప్పనిసరిగా ఓ ఫార్మసిస్ట్ ఉండాలి. కానీ ఏ ఒక్క షాపులో కూడా ఫార్మా సిస్టులు ఉండడంలేదు. మందులు కొనుగోలు చేసిన వారికి తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి. ఆ బిల్లుపై బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, ఎక్స్ పైరీ డేట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ చాలా మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన మందులకు బిల్లులు ఇవ్వడం లేదు. గతంలో హెచ్ 1 మందులు అమ్మిన ఆరు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. కానీ ఆ తర్వాత పట్టించుకోవడంలేదు.