కాంగ్రెస్‌‌ తోనే భూ నిర్వాసితులకు న్యాయం : టీజీఐఐసీ చైర్‌‌ పర్సన్‌‌ నిర్మల జగ్గారెడ్డి

కాంగ్రెస్‌‌ తోనే భూ నిర్వాసితులకు న్యాయం : టీజీఐఐసీ చైర్‌‌ పర్సన్‌‌ నిర్మల జగ్గారెడ్డి
  •     జగ్గారెడ్డి కృషితో 93 మందికి ఇండ్ల పట్టాలు
  •     పట్టాలు పంపిణీ చేసిన టీజీఐఐసీ చైర్‌‌పర్సన్‌‌ నిర్మల జగ్గారెడ్డి

కొండాపూర్, వెలుగు: పదమూడేండ్లుగా ఎదురుచూస్తున్న భూ నిర్వాసితులకు కాంగ్రెస్‌‌ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరిగిందని టీజీఐఐసీ చైర్‌‌పర్సన్‌‌ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగరపల్లి, అలియాబాద్ గ్రామాల శివారులో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కోల్పోయిన 93 మంది నిర్వాసితులకు 125 గజాల చొప్పున ఇండ్ల స్థలాల పట్టాలను బుధవారం పంపిణీ చేశారు. కొండాపూర్ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్మల జగ్గారెడ్డి పట్టాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొగరపల్లి, అలియాబాద్ గ్రామాల శివారులోని సర్వే నంబర్‌‌ 418లో పరిశ్రమల ఏర్పాటుకు రైతుల నుంచి భూములు సేకరించిన సమయంలో నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. భూములు కోల్పోయిన వారికి 125 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు కేటాయించాలని టీపీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ జగ్గారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డికి వినతిపత్రం అందజేశారని, దాంతో ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకువచ్చి నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్‌‌ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌‌ వై.ప్రభు, మండల కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్‌‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.