ప్రజా పాలనలో గణేశ్ ఉత్సవాలకు సౌకర్యాలు కల్పించాం : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌

ప్రజా పాలనలో గణేశ్ ఉత్సవాలకు సౌకర్యాలు కల్పించాం : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌

తిమ్మాపూర్(మానకొండూర్), వెలుగు: ప్రజా ప్రభుత్వ పాలనలో భక్తులకు అన్ని వసతులు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. బుధవారం ఎమ్మెల్యేలు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి ఆయన కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువులో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్ని మండపాలకు ఉచిత విద్యుత్ అందజేశామని అన్నారు. గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి వెంట కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్‌‌‌‌ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, ఆర్డీవో షర్మిల, తహసీల్దార్లు‌‌‌‌ విజయ్ కుమార్, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, సీఐలు శ్రీలత, రమేశ్‌‌‌‌ పాల్గొన్నారు.

శంకరపట్నం,వెలుగు: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత అనారోగ్యంతో ఇటీవల చనిపోయారు. మంత్రి పొన్నం బాధిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. ఆమె ఫొటో వద్ద నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామ అభివృద్ధికి సుజాత చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు .

స్టెప్పేసిన మంత్రి..!

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జన ర్యాలీలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆయన స్టెప్పేశారు. గణేశుడికి వీడ్కోలు పలుకుతూ సాగిన భరాత్‌‌‌‌లో మంత్రి డ్యాన్స్‌‌‌‌ చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.