నేరడిగొండ, వెలుగు: ప్రభుత్వ వైఫల్యం వల్లే రిమ్స్‌లో శిశువులు చనిపోయారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్ హాస్పిటల్‌లో జరిగిన విషాదంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ, బాధితులకు సంఘీభావం తెలిపేందుకు జిల్లాకు వచ్చిన బీఆర్ఎస్ మహిళా ప్రతినిధుల బృందం నేరడిగొండ మండలంలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పసికూనలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ బృందంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, లీడర్లు తుల ఉమా, తదితరులు ఉన్నారు.
