
కోల్‌కతా: బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై పశ్చిమ బెంగాల్ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వార్ కొనసాగిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా మోడీపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాలేనని చెప్పిన మమత.. తాజాగా నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీకి హాజరుకాలేనని ప్రకటించారు. నీతి ఆయోగ్ పనికిరానిదని, దాంతో ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. రాష్ర్టాలు రూపొందించిన ప్రణాళికలకు మద్దతిచ్చేందుకు నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఫైనాన్షియల్ పవర్స్ లేవని అన్నారు. ‘‘నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థిక అధికారాలు లేవు.రాష్ట్రాలను సపోర్ట్‌చేసే అధికారం కూడా లేదు. ఎలాంటి ఆర్థిక అధికారాలు లేని ఓ సంస్థ సమావేశానికి రావడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు” అని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానికి లెటర్ రాశారు. నీతి ఆయోగ్‌కు బదులు ఇంటర్ స్టేట్ కౌన్సిల్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. 15న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఐదో సమావేశం మోడీ అధ్యక్షతన జరగనుంది.
ఏకపక్షంగా ఏర్పాటు చేశారు..
నీతి ఆయోగ్‌ను ఏకపక్షంగా ఏర్పాటు చేశారని, రాష్ర్టాల ముఖ్యమంత్రులతో చర్చించకుండానే ప్రకటించారని లేఖలో మమత ఆరోపించారు. రాష్ట్రాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేసేలా నీతి ఆయోగ్ కు కొన్ని అధికారాలు కట్టబెట్టాలని అధికారులు, ఓ కేంద్ర మాజీ మంత్రి చేసిన కామెంట్స్‌ను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. అయితే సమావేశానికి వెళ్లబోనన్న మమత.. తమ ప్రభుత్వం తరఫున ఇంకెవరైనా హాజరవుతారా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అంతకుముందు ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి, కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసే విషయమై జరిగిన సమావేశాలకు కూడా ఆమె హాజరుకాలేదు. బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిశ్రాను పంపారు.