పిల్లలపై థర్డ్ వేవ్  ఎఫెక్ట్ ఎక్కువని చెప్పలేం 

పిల్లలపై థర్డ్ వేవ్  ఎఫెక్ట్ ఎక్కువని చెప్పలేం 


న్యూఢిల్లీ:  కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపైనే వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందనేందుకు ఇప్పటికైతే ఎలాంటి సూచనలు కన్పించడం లేదని నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్) డాక్టర్ వీకే పాల్ అన్నారు. ఫస్ట్ వేవ్ లో వయసు పైబడిన పెద్దోళ్లపై, సెకండ్ వేవ్ లో యూత్ పై వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా కన్పించింది. థర్డ్ వేవ్ లో పిల్లలపైనే ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లలకు కూడా కరోనా సోకుతుందని, కానీ వారిపై వైరస్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందని కేంద్రం గతంలోనే ప్రకటించిందన్నారు. పిల్లలకు కరోనా వ్యాపిస్తే చాలావరకూ సింప్టమ్స్ కన్పించవని, ఒకవేళ సింప్టమ్స్ వచ్చినా స్వల్పంగా ఉంటాయన్నారు. పిల్లలను హాస్పిటల్ లో చేర్పించాల్సినంత సీరియస్ పరిస్థితి రాదన్నారు. అయితే పిల్లలకు వైరస్ సోకితే, వాళ్ల ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం మాత్రం ఉంటుందని వీకే పాల్ తెలిపారు. చిన్నారులకు కరోనా సోకే అవకాశాలు తక్కువన్నది కూడా కరెక్ట్ కాదన్నారు. పిల్లలు, పెద్దల్లో పాజిటివిటీ రేటు కూడా ఒకేలా ఉన్నట్లు డిసెంబర్, జనవరి సీరో సర్వేలో తేలిందన్నారు. 

ఏడాది చివర్లో థర్డ్ వేవ్?

ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరించారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపుaనిచ్చారు. థర్డ్ వేవ్ లో పిల్లలపైనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని, పిల్లలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టాయి. ప్రధానంగా పిల్లల రక్షణపై దృష్టి సారించాయి.