బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఏకగ్రీవ ఎన్నిక.. అసలు ఎవరీయన..?

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఏకగ్రీవ ఎన్నిక.. అసలు ఎవరీయన..?

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికలో ఆయనొక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 2026, జనవరి 20వ తేదీన బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. 

2026, జనవరి 19న బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ పత్రాల పరిశీలన జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు.

 అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. నితిన్ నబిన్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ, జి కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్ సహా సీనియర్ మంత్రులు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. 

నితిన్ నబీన్ బ్యాగ్రౌండ్:

బీహార్ సీనియర్ పొలిటిషియన్, దివంగత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కొడుకే నితిన్ నబీన్. కాయస్త కమ్యూనిటీకి చెందిన ఆయన.. ఇప్పటివరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006లో ఆయన తండ్రి నవీన్ కిశోర్ మరణంతో పాట్నా వెస్ట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికకు బీజేపీ అధిష్టానం నితిన్‎ను బరిలోకి దింపగా ఆయన ఘన విజయం సాధించారు. 

Also Read : బిచ్చగాడే కానీ కోటీశ్వరుడు.. 3 ఇండ్లు, కార్లు, ఆటోలు

ఆ తరువాత బంకిపూర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు నితిన్ నబిన్. ఇటీవలే బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‎గా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2026లో వెస్ట్ బెంగాల్, తమిళనాడు వంటి కీలకమైన రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆయన పనితనానికి సవాల్ విసరనున్నాయి.