బిచ్చగాడే కానీ కోటీశ్వరుడు.. 3 ఇండ్లు, కార్లు, ఆటోలు.. అబ్బో ఇతని వ్యాపారం మామూలుగా లేదుగా !

బిచ్చగాడే కానీ కోటీశ్వరుడు.. 3 ఇండ్లు, కార్లు, ఆటోలు.. అబ్బో ఇతని వ్యాపారం మామూలుగా లేదుగా !

పురుషులందు పుణ్య పురుషులూ వేరయా అన్నట్లు.. బిక్షగాళ్లలో ధనిక బిక్షగాళ్లు వేరయా అనుకోవాలేమో. ఎందుకంటే అడుక్కుంటూనే కోట్లు సంపాదించాడు మనం మాట్లాడుకుంటున్న బెగ్గర్. మూడు ఇండ్లు, కార్లు, ఆటోలతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తూ.. కోట్లు సంపాదిస్తూనే మళ్లీ ఎప్పట్లాగే యాచక వృత్తిని కొనసాగిస్తున్నాడు. ఇతని ఆస్తి గురించి తెలిసి అధికారులే షాకయ్యారు. 

ఇండియా మొత్తం ట్రెండింగ్ అవుతున్న ఇతనిది మధ్యప్రదేశ్ ఇండోర్. అక్కడి ప్రభుత్వం బిచ్చగాళ్ల నిర్మూలన కోసం ప్రారంభించిన క్యాంపెయిన్ లో కోటీశ్వరుడైన యాచకుడి గురించి తెలిసి నోరెళ్లబెట్టారు అధికారులు. మంగీలాల్ అనే వ్యక్తి ఇండోర్ సిటీలో వేర్వేరు చోట్ల మూడు ఇండ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని కిరాయికి ఇవ్వటంతో పాటు అవసరం ఉన్నవాళ్లకు డబ్బులు ఇస్తూ వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడు. 

మహిళా,శిశు సంక్షేమ శాఖ టీమ్ ఇతని గురించి తెలుసుకున్నాక ఇతని గురించి బాగా చర్చనీయాంశంగా మారింది. రెడ్ క్రాస్ సంస్థ ప్రభుత్వం సంయుక్తంగా ఇచ్చిన ఇల్లు కూడా ఉంది మంగీలాల్ కు. అయినప్పటికీ ఇండోర్ వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేయడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

కార్లు, ఆటోలు కిరాయికి:

మంగీలాల్ కు మూడు ఆటోలు ఉండగా వాటిని రెంట్ కు ఇస్తుంటాడు. అదే విధంగా తనకున్న మారుతి సుజుకీ డిజైర్ కారును కూడా కిరాయికే ఇచ్చాడు. ఇండోర్ భగత్ సింగ్ నగర్ లో మూడు అంతస్తుల బిల్డింగ్ తో పాటు శివ్ నగర్, అల్వాస్ లో మరో రెండు ఇండ్లున్నాయి. 

కార్లు, ఆటో, ఇండ్ల కిరాయితో పాటు వడ్డీ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు మంగీలాల్. సరాఫ బజార్ ప్రాంతంలో వడ్డీలకు డబ్బులు ఇస్తూ.. రెగ్యులర్ గా వచ్చి.. ఒక్కొక్కరి దగ్గర 400 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తుంటాడు. బాగా సంపాదిస్తున్నాడు కదా అని అతడిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవద్దని అధికారులు చెబుతున్నారు. యాచక వృత్తికి పాల్పడితే చర్యలు తప్పవంటున్నారు. 

వ్యాపారాలపై ఫిర్యాదు:

మంగీలాల్ కు ఇంత ఆస్తి ఉండి కూడా అడుక్కోవడంపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ వడ్డీ వ్యాపారం చేస్తుండటంతో.. కొందరు ఫిర్యాదు చేసినట్లు జిల్లా నోడల్ ఆఫీసర్ తెలిపారు. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ టీమ్ అతడిని అదుపులోకి తీసుకున్నట్లు భిక్షాటన చేయకుండా కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భిక్షగాళ్లను ఏరివేసేందుకు.. వారికి అవగాహన కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భిక్షాటనను ప్రోత్సహించినా, చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.