జేడీయూ చీఫ్​గా నితీశ్ కుమార్ ఏకగ్రీవంగా

జేడీయూ చీఫ్​గా నితీశ్ కుమార్ ఏకగ్రీవంగా
  • పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్​లో నిర్ణయం
  • నితీశ్ పేరును ప్రతిపాదించిన లలన్ సింగ్ 
  • ఏకగ్రీవంగా ఆమోదించిన కమిటీ సభ్యులు
  •   రెండో సారి పార్టీ పగ్గాలు చేపట్టనున్న బీహార్ సీఎం

న్యూఢిల్లీ, వెలుగు:  జనతా దళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. జేడీయూ చీఫ్​గా ఉన్న లలన్ సింగ్.. పార్టీ చీఫ్​గా నితీశ్ పేరును ప్రతిపాదించగా.. పార్టీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇండియా కూటమిలో కీలక నేతగా ఉన్న నితీశ్ కుమార్.. జేడీయూ చీఫ్​గా ఉండాలని పార్టీ నేతలు కోరారు. కూటమిలోని వివిధ పార్టీల లీడర్లను ఏకతాటిపైకి తీసుకొస్తుండటంలో నితీశ్ కీలక పాత్ర పోషిస్తున్నారని, పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్​లో జరిగిన జేడీయూ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్​లో పార్టీ చీఫ్​గా నితీశ్​ ను ఎన్నుకున్నారు. 

జేడీయూ చీఫ్​గా నితీశ్ రెండోసారి పగ్గాలు చేపట్టారని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి తెలిపారు. మంత్రి విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. పార్టీ సీనియర్ లీడర్లు, కార్యకర్తల కోరిక మేరకే జేడీయూ చీఫ్​గా నితీశ్ ఎన్నికైనట్లు వివరించారు. కాగా, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ యాదవ్ చనిపోయాక 2016లో నితీశ్ కుమార్ పార్టీ చీఫ్​గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు నాలుగేండ్లు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేత రాంచంద్ర ప్రసాద్ సింగ్ ఏడాది కాలం పాటు చీఫ్​గా ఉన్నారు. అనంతరం 2021 నుంచి లలన్ సింగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 

పార్టీని చీల్చాలని చూసిన లలన్ సింగ్?  

లలన్ సింగ్ నాయకత్వంపై పలువురు సీనియర్ లీడర్లు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఆయన చీఫ్​గా ఉండటాన్ని కొందరు బహిరంగంగానే వ్యతిరేకించారు. పలుమార్లు సీఎం నితీశ్​కుమార్ తో జరిగిన భేటీలోనూ లలన్ సింగ్ లీడర్​షిప్​పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. లలన్​సింగ్ చీఫ్​గా ఉంటే.. పార్టీ చీలిపోతుందన్న వార్తలు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన నితీశ్... వెంటనే ఆ బాధ్యతలు తాను తీసుకున్నట్లు తెలుస్తున్నది. దీనికితోడు ఆర్జేడీకి లలన్ సింగ్ చాలా సన్నిహితంగా మెలుగుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. 

ఆర్జేడీ చీఫ్​ లాలూ ప్రసాద్ కొడుకు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ను సీఎం చేయాలని, అవసరమైతే జేడీయూను చీల్చాలని ఆయన ప్రయత్నించారన్న ప్రచారం సాగింది. 12 మంది ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ కూడా పెట్టారని.. అందుకే పార్టీని  నితీశ్ తన చేతుల్లోకి తీసుకున్నారని చెప్తున్నారు. అయితే, ఈ పుకార్లను మాత్రం పార్టీ సీనియర్ లీడర్లు కొట్టిపారేశారు.  

నితీశ్ నేతృత్వంలోనే...

సీఎం నితీశ్ సారథ్యంలోనే 2024 లోక్ సభ, 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని జేడీయూ వర్గాలు భావించాయి. ఈ క్రమంలో లలన్ సింగ్ స్థానంలో మళ్లీ పగ్గాలు చేపట్టాలని నితీశ్​ను కొంత కాలంగా పార్టీ నేతలు కోరినట్లు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ను మరింత పటిష్టం చేయాలన్నదే నితీశ్ కుమార్ లక్ష్యమని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ ముక్త్ భారత్ చేయాలన్నదే పార్టీ లక్ష్యమని వివరించాయి. ప్రధాని కావాలనే కోరిక కూడా నితీశ్​కుమార్​కు లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.