- బీజేపీకి 15-16, జేడీయూకు 14 కేబినెట్ బెర్తులు
- ఎల్జేపీకి 3, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎంకు ఒక్కోటి చొప్పున ఖరారు
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి.. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శనివారం జరిగిన మీటింగ్‌లో సీఎం ఎవరు?, కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి? అనే దానిపై క్లారిటీ వచ్చింది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌నే మళ్లీ సీఎం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆయన పదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించనున్నారు. ఇక ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున ఇవ్వాలనే నిబంధన ఆధారంగా కూటమిలోని పార్టీలకు కేబినెట్ బెర్తులను ఖరారు చేసినట్టు సమాచారం.
ఈ లెక్కన బీజేపీకి 15 నుంచి 16, జేడీయూకు 14, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 3, హిందుస్థాన్ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలకు ఒక్కో మంత్రి పదవి చొప్పున దక్కే అవకాశం ఉంది. మరోవైపు బుధవారం లేదా గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రధాని మోదీ షెడ్యూల్‌ను బట్టి తేదీని ఖరారు చేయనున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కూటమిలోని పార్టీలకు చెందిన సీనియర్ నేతలు హాజరు కానున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 202 సీట్లు రాగా.. బీజేపీకి 89, జేడీయూకు 85, ఎల్జేపీ (ఆర్‌వీ) 19, హెచ్‌ఏఎంకు 5, ఆర్‌ఎల్‌ఎంకు 4 చొప్పున సీట్లు దక్కాయి.
నేడు కేబినెట్ భేటీ.. అసెంబ్లీ రద్దుకు తీర్మానం
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ కూడా వేగంగా జరుగుతున్నది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో సోమవారం కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇందులో ప్రస్తుత 17వ అసెంబ్లీని రద్దు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం సీఎం నితీశ్ తన రాజీనామాను గవర్నర్‌కు అందజేస్తారు. తర్వాత ఎన్డీయే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశమై తమ ఎల్పీ లీడర్‌ను ఎన్నుకోవడంతో పాటు.. అన్ని పార్టీలు కలిసి ఎన్డీయే ఎల్పీ లీడర్‌ను ఎన్నుకుంటాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్‌కు లెటర్ అందజేస్తాయి.
