సౌతాఫ్రికాతో జరగబోయే రెండో టెస్ట్ కోసం తెలుగు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి భారత టెస్ట్ స్క్వాడ్ లో చేరాడు. కోల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో నితీష్ గాయం కారణంగా ఆడలేదు. రెండో టెస్టుకు ఫిట్ గా ఉండడంతో నితీష్ జట్టులోకి వచ్చాడు. అంతేకాదు ఈ తెలుగు ఆల్ రౌండర్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ స్థానంలో నితీష్ రెండో టెస్టులో తుది జట్టులోకి రానున్నట్టు సమాచారం. ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ స్థానంలో ఆల్ రౌండర్ ఎలా వస్తాడనే అనుమానాలు ఉన్నాయి.
తొలి టెస్టులో వాషింగ్ టన్ సుందర్ మూడో స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో కలుపుకుంటే ఈ టెస్టులో ఇండియా టాప్ స్కోరర్. కఠిన పిచ్ పై దుర్బేధ్యమైన డిఫెన్స్ తో రాణించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రెండో టెస్టుకి గిల్ అందుబాటులో లేకపోతే తుది జట్టులోకి దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్ వస్తారని భావించారు. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పడిక్కల్, సాయి సుదర్శన్ ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లే. మూడో స్థానంలో వచ్చే సుందర్, ఐదో స్థానంలో ఆడే పంత్ కూడా లెఫ్ట్ హ్యాండర్లే. ఓపెనర్ గా జైశ్వాల్ లెఫ్ట్ హ్యాండర్.
వరుసగా ఇంత మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే సౌతాఫ్రికా జట్టును ఇబ్బంది పెట్టడం నష్టమే. సాయి సుదర్శన్ కు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన అనుభవం లేదు. మరోవైపు పడికల్ నాలుగో స్థానంలో ఎలా బ్యాటిం చేస్తాడో అనుమానంగా మారింది. దీంతో నాలుగో స్థానంలో భారత జట్టుకు రైట్ హ్యాండర్ కావాలి. నితీష్ ప్లేయింగ్ 11లోకి వస్తే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. ఈ కారణంగా నితీష్ రెండో టెస్ట్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌహతి వేదికగా రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ గెలవడం చాలా కీలకం.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ నితీష్ కుమార్ రెండో టెస్టులో ఆడితే ఇండియా నలుగురు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగనుంది. వాషింగ్ టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా రూపంలో ఇప్పటికే జట్టులో ముగ్గురు స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నారు. నితీష్ వస్తే ఆ సంఖ్య నాలుగుకు చేరుతుంది.
